Singareni women machinery operators : బొగ్గు గనుల్లోని భారీ యంత్రాల స్టీరింగ్ ఇక మహిళల చేతిలోకి రానుంది. పురుషులకే పరిమితమైన ఓ రంగంలోకి మహిళలు అడుగుపెట్టబోతున్నారు. మహిళా సాధికారత దిశగా సింగరేణి సంస్థ ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో పనిచేసే భారీ యంత్రాలకు ఆపరేటర్లుగా మహిళలను నియమించాలని నిర్ణయించింది. సింగరేణి నూరేళ్ల చరిత్రలో ఇలాంటి అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. అసలు ఈ వినూత్న ఆలోచనకు బీజం ఎక్కడ పడింది..? ఈ ఉద్యోగాలకు అర్హతలేంటి..? ఎంపిక విధానం ఎలా ఉంటుంది..?
సీఎండీ ఆలోచన.. చారిత్రక నిర్ణయం : మైనింగ్ రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ ఆలోచనల మేరకు, సంస్థ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో, వారికి అత్యంత కీలకమైన ఆపరేటర్ల పోస్టులను అప్పగించాలని యాజమాన్యం భావించింది. ఈ మేరకు అన్ని గనులు, విభాగాలకు శనివారం అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది.
అర్హతలు ఇవే : ప్రస్తుతం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించారు.
హోదా: సంస్థలో జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్‌గా పనిచేస్తూ ఉండాలి.
వయసు: 35 సంవత్సరాల లోపు ఉండాలి.
విద్యార్హత: కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్: దరఖాస్తు చేసుకునే మహిళలకు తప్పనిసరిగా టూవీలర్ లేదా ఫోర్‌వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆగస్టు 2024కు ముందే లైసెన్స్ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
శారీరక సామర్థ్యం: ఈ ఉద్యోగానికి అవసరమైన శారీరక సామర్థ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం ఎలా : ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, పలు దశల్లో ఉంటుంది.
దరఖాస్తు: అర్హులైన మహిళా ఉద్యోగులు, నిర్దేశిత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత గని మేనేజర్ లేదా శాఖాధిపతికి సమర్పించాలి.
పరిశీలన: వచ్చిన దరఖాస్తులను జీఎం (సీపీపీ) నేతృత్వంలోని కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు, సిరిసిల్లలోని ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’ సంస్థలో హెవీ మోటార్ వెహికల్ విభాగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
పరీక్ష, నియామకం: శిక్షణ పూర్తయ్యాక, ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని ‘ఈపీ ఆపరేటర్ ట్రైనీ (కేటగిరి-5)’గా నియమించి, సంబంధిత ఏరియాలకు కేటాయిస్తారు. ఈ చారిత్రక నిర్ణయం, సింగరేణిలో లింగ సమానత్వానికి బాటలు వేయడమే కాకుండా, ఎందరో మహిళలకు ఉన్నతమైన ఉపాధి అవకాశాలను కల్పించనుంది.


