Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణి సోలార్ రెండవ దశలో13 ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు

Singareni: సింగరేణి సోలార్ రెండవ దశలో13 ప్లాంట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా చేపట్టిన సోలార్ విద్యుత్ ఉత్పాదన పూర్తి విజయవంతం కావడంతో, దీనిని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది.
మొదటి దశలో 300 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పుడు రెండవ దశలో 240 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా నిర్మించాలని, వీటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ నెలరోజుల క్రితం ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు సారథ్యంలో సింగరేణిలోని 9 ఏరియాల్లోని ఖాళీ ప్రదేశాలను గుర్తించి రెండవ దశలో 240 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదన లక్ష్యసాధన కోసం వివిధ సామర్థ్యాలు గల ప్లాంట్లను నెలకొల్పవచ్చని సూచిస్తూ డి.పి.ఆర్. లను సిద్ధం చేశారు. శుక్రవారం రోజున హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్ష సమావేశంలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ వీటిపై సమగ్రంగా చర్చించారు.
సత్తుపల్లి వద్ద 35 మెగావాట్ల ప్లాంట్లు, శ్రీరాంపూర్ ఐ.కె. చెన్నూరు వద్ద 27.5 మెగావాట్ల ప్లాంటు, మందమర్రి ప్రాంతంలో పలు గనులు, కాలనీల వద్ద అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో 65 మెగావాట్ల సామర్థ్యంతో 5 ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో 37.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను, రామగుండం-3 ఏరియాలో 41 మెగావాట్ల సామర్థ్యం కోసం రెండు చోట్ల ప్లాంట్లు నిర్మించాలని, భూపాలపల్లిలో 12 మెగావాట్ల ప్లాంట్ ను, రామగుండం-1 ఏరియాలో పాత పవర్ హౌస్ స్థలంలో 5 మెగావాట్ల ప్లాంట్ ను, ఇల్లందులో ప్రస్తుతం ఉన్న సోలార్ ప్లాంట్ కు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో 15 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.
ఈ ప్రతిపాదనలపై సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ కూలంకషంగా చర్చించి,
పలు సవరణలు, సూచనలు చేశారు. వీటిపై మరింత లోతుగా పరిశీలనలు జరిపి రెండవ దశలో నిర్మించబోయే మొత్తం 13 సోలార్ పవర్ ప్లాంట్లపై సమగ్ర నివేదికను వారంలోగా రూపొందించాలని, తదుపరి జరగనున్న బోర్డు సమావేశంలో ఈ నిర్మాణాలకు బోర్డు నుండి అనుమతులు తీసుకోవడం జరుగుతుందని ఆ వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా సింగరేణి విద్యుత్ ఖర్చులు చెల్లు
సింగరేణి సంస్థ తన గనుల అవసరాలకు మరియు నివాస కాలనీల అవసరాల కోసం ప్రతి ఏడాది 750 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. ట్రాన్స్కో నుండి ఈ విద్యుత్తును సగటున యూనిట్కు 8 రూపాయల చొప్పున ఏడాదికి రూ.600 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులను కడుతుంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ భారీ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం సంస్థ ఛైర్మన్ శ్రీ ఎన్.శ్రీధర్ రెండేళ్ల క్రితం సోలార్ ప్లాంట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మొదటిదశలో పూర్తయిన 224 మెగావాట్ల సామర్థ్యం గల 9 ప్లాంట్లు పూర్తయి విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులో దాదాపు 300 కోట్ల రూపాయల మేర కంపెనీకి ఆదా చేకూరింది. మొదటిదశలోని మరో 76 మెగావాట్ల ప్లాంట్లు కూడా త్వరలో నిర్మాణం పూర్తయి ప్రారంభమయితే మొదటిదశ ద్వారా మొత్తం 450 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న 240 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు కూడా పూర్తయితే వీటి నుండి మరో 360 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే మొత్తం మీద సింగరేణి నెలకొల్పే 540 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నుండి 810 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది అన్నమాట.
సింగరేణి సంస్థ ఏటా తన అవసరాలకు వినియోగించే 750 మిలియన్ యూనిట్ల కన్నా ఇది ఎక్కువే. కనుక, మరో రెండేళ్లలో సింగరేణి కేవలం విద్యుత్ మార్పిడి తప్ప తెలంగాణ ట్రాన్స్కో నుండి విద్యుత్ కొనాల్సిన అవసరమే ఉండదు. దీంతో సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ పై నడిచే పరిశ్రమగా రూపుదిద్దుకొని ‘నెట్ జీరో ఎనర్జీ’ సంస్థగా మారిన తొలి బొగ్గు పరిశ్రమగా పేరు తెచ్చుకోనుంది. ఈ దిశగా విద్యుత్ విభాగం వారు కాలపరిమితులు నిర్ణయించుకోని పనులు వేగంగా పూర్తిచేయాలని ఛైర్మన్ నిర్దేశించారు. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పనితీరును సమీక్షిస్తూ ఎఫ్జీడీ నిర్మాణాన్ని కాలపరిమితిలోపు పూర్తి చేయాలని, పచ్చదనం, సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఇ అండ్ ఎండి. సత్యనారాయణరావు, సి.టి.సి. ఎస్.కె. సూర్, చీఫ్ ఓ అండ్ ఎం జె.ఎన్. సింగ్, జీఎం డి.వి.ఎస్.ఎన్. రాజు, జీఎం సోలార్ ఎస్. జానకిరామ్, జీఎం సివిల్ టి. సూర్యనారాయణ, చీఫ్ ఈ అండ్ ఎం ఎన్.వి.కె.వి. రాజు, ఏజీఎం (ఎఫ్ అండ్ ఏ) టి. సుధాకర్, ఏజీఎం సివిల్ కె.ఎస్.ఎన్. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News