Sircilla weaver QR code shawl : అగ్గిపెట్టెలో ఇమిడే చీర.. రంగులు మారే వస్త్రం.. సిరిసిల్ల నేతన్నలు తమ నైపుణ్యంతో సృష్టించిన అద్భుతాలివి. ఈ పరంపరను కొనసాగిస్తూ, ఓ యువ నేతన్న మరో అడుగు ముందుకేసి, సాంకేతికతకు, సంప్రదాయానికి ముడిపెట్టారు. ఏకంగా శాలువాపైనే క్యూఆర్ కోడ్ (QR Code)ను నేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే, తెలంగాణ వైభవం కళ్లముందు కదలాడుతుంది. ఇంతకీ ఎవరా నేతన్న? ఈ వినూత్న ఆవిష్కరణ వెనుక ఉన్న ఆయన ఆలోచన ఏంటి?
సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, ఈ అద్భుతమైన శాలువాను రూపొందించారు. ‘పోగు బంధంతో ఫోన్ బంధం’ అనే సరికొత్త ఆలోచనతో, మగ్గంపైనే క్యూఆర్ కోడ్‌ను నేరుగా నేసారు. ఈ వినూత్న శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించి, విజయ్ కుమార్ నైపుణ్యాన్ని అభినందించారు.
స్కాన్ చేస్తే ఏమొస్తుంది : ఈ శాలువాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మన స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయగానే, తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రత్యక్షమవుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు (యాదాద్రి వంటివి), చారిత్రక కట్టడాల వివరాలు కనిపిస్తాయి. కేసీఆర్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల గొప్పతనాన్ని తెలిపే సమాచారం కూడా ఇందులో పొందుపరిచారు.
15 రోజుల్లోనే అద్భుతం : కేవలం 15 రోజుల వ్యవధిలోనే, ఎంతో నైపుణ్యంతో ఈ శాలువాను రూపొందించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. తన తండ్రి గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి స్ఫూర్తిగా నిలిచారని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
“కేసీఆర్ గారు తెలంగాణకు చేసిన అభివృద్ధి, మన వారసత్వ సంపదను పదిమందికీ తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్ శాలువాను రూపొందించాను. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే నా లక్ష్యం.”
– నల్ల విజయ్ కుమార్, చేనేత కళాకారుడు
ఈ అద్భుత ఆవిష్కరణను కేటీఆర్ ద్వారా కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని విజయ్ కోరగా, కేటీఆర్ తప్పకుండా అందజేస్తానని హామీ ఇచ్చారు.

