Saturday, November 15, 2025
HomeతెలంగాణSLBC: ఎస్‌ఎల్‌బీసీ తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్టు

SLBC: ఎస్‌ఎల్‌బీసీ తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్టు

Revanth Reddy: ఎస్ఎల్‌బీసీ.. తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, పనుల పునరుద్ధరణ వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రాజెక్టు పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్లగొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమని, అందుకే ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో ఈ పనులు చేపట్టాలని సూచించారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గతంలో జరిగిన తప్పులు, లోటు పాట్లు పునరావృతం కాకుండా పక్కడ్బందీగా అత్యంత భద్రంగా రక్షణ చర్యలు చేపట్టి ముందుకు సాగాలని చెప్పారు. అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. సర్వేతోపాటు పనులు పూర్తయ్యేంత వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సలహాలు, సూచనలు, భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని ఆదేశించారు. భవిష్యత్‌లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్ట్‌లకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్‌బీసీ నిర్మాణం పూర్తి చేయాలని, ఇదొక కేస్ స్టడీగా ఉండాలన్నారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే అటవీ, ఇంధన శాఖ ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్‌బీసీ పునరుద్ధరణ పనులకు అవసరమైన అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15వ తేదీలోగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారుల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించారు. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎస్ఎల్‌బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని, సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

గడువులోగా పూర్తి చేయాలి
‘ఎస్ఎల్‌బీసీ.. ఏళ్లకేళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కలల ప్రాజెక్టు. ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్‌బీసీలో అవకాశం ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2027 డిసెంబర్ 9న తెలంగాణ జాతికి అంకితం చేయాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని.. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకొనేది లేదని సూచించారు. ఇన్‌లెట్ వైపు నుంచి ఔట్‌లెట్ వైపు నుంచి పనులు చేపట్టాలని, అందుకు అవసరమైన యంత్రాలతోపాటు సరిపడా నిపుణులు, కార్మికులను రంగంలోకి దింపాలని సూచించారు. ఎస్ఎల్‌బీసీ పనులకు గ్రీన్ ఛానల్‌లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికిగానూ ఇప్పటికే 35 కిలో మీటర్లు తవ్వడం పూర్తయ్యిందని, మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికిగానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు పరీక్షిత్ మోహ్ర వివరించారు. ప్రతి నెలా 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకొని, జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిస్ట్యూట్ ద్వారా ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారు అదిత్యా దాస్ నాథ్, ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ ఇంజానీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, స్పెషల్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహరా, ఈఎన్‌సీలు అంజత్ హుస్సేన్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, చీఫ్ సైంటిస్ట్ హెచ్‌వీఎస్ సత్యనారాయణ, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేవీ మారుతి, డైరెక్టర్ శైలేంద్ర కుమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad