SLBC:ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు త్వరలోనే పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపగా.. కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన తరువాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చకచకా ప్రారంభించింది. అయితే, అనుకోకుండా జరిగిన ఘటనతో పనులకు బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి ఈ మహత్తర లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇరిగేషన్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇటీవల ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. డిసెంబర్ 9, 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేస్తూ, ఇన్‌లెట్ వైపు నుంచి ఔట్‌లెట్ వైపు పనులు జరిగేలా, ప్రతి నెలా 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యాన్ని సాధించేందుకు ఇరిగేషన్ అధికారులు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
నూతన టెక్నాలజీతో పనులు
ఇటీవల జరిగిన ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. దీంతో గతంలో జరిగిన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఈసారి అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో దెబ్బతిన్న పాత టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) స్థానంలో అమెరికా నుంచి అత్యాధునిక యంత్రాన్ని తెప్పించి, నూతన టెక్నాలజీతో పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, సొరంగాల నిర్మాణంలో అపారమైన అనుభవం ఉన్న మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పల్ సింగ్‌ను ఇరిగేషన్ సలహాదారుగా నియమించింది. ఆయన నేతృత్వంలోనే పనులు జరగనున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో హర్పల్ సింగ్ పాల్గొని సూచనలిచ్చారు. కాగా, ఆయనకు ఉన్న సైనిక క్రమశిక్షణ, ఇంజినీరింగ్ నైపుణ్యం ఈ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన చోట అలైన్‌మెంట్ మార్పు
సొరంగంలోనే చిక్కుకున్న పాత మిషన్‌ను బయటకు తీసేందుకు అధిక సమయం, నిధులు ఖర్చవుతాయి. అందుకే ఆ మిషన్‌ను అక్కడే వదిలి దాని చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించి పూర్తిగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతం నుంచి అలైన్‌మెంట్‌ను మార్చి మిగతా పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు రచించారు. ఈ కీలక నిర్ణయంతో పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే సొరంగం ప్రాంతంలో మైనర్ వర్క్స్ జరుగుతున్నాయి, త్వరలోనే ప్రధాన పనులను మూడు షిప్ట్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులను అధిగమించడానికి, ఎన్జీఆర్‌ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) శాస్త్రవేత్తల సహకారాన్ని తీసుకోనున్నారు. వాళ్లంతా ఏరియల్ లైడార్ సర్వే ద్వారా సొరంగం మార్గంలో ఉన్న శిలా నిర్మాణాలు, భూమి లోపల ఉన్న పరిస్థితులను అంచనా వేసి, సురక్షితమైన మార్గాన్ని సూచిస్తారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించినట్లు సమాచారం.
ఇప్పటికే 44 కిలోమీటర్లు పూర్తి
ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించడానికి మొత్తం 50.75 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలు నిర్మించాల్సి ఉంది. ఇందులో 44 కిలోమీటర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా 9 కిలోమీటర్ల మేర పనులు మిగిలి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా, గ్రావిటీ ద్వారా తరలించడం దీని ప్రధాన ప్రయోజనం. ఇది విద్యుత్ ఖర్చులను గణనీయంగా ఆదా చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇది రైతుల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా, రాష్ట్ర వ్యవసాయ రంగానికి గణనీయమైన ఊతం ఇస్తుందని ఈ మేరకు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.


