ఎస్ ఎల్ బి దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్ లో తనికీలు నిర్వహించాయి. వీరి బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు.
ఉత్తరాఖండ్ లో జరిగిన విపత్తులలో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషనలను సమర్థవంతంగా నిర్వహించాయి. వీరితో పాటు 14 మంది ర్యాట్ ( ర్యాట్ హోల్ టీమ్)మైనర్స్ ల సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారి ఆచూకి తెలుసుకునేందుకు స్నిప్పర్ డాగ్స్ లను కూడా రప్పించారు. అయితే, నీరు ఉన్నందున ఈ స్నిప్పర్ డాగ్స్ లోపలికి వెళ్లలేక పోయాయి. ఇప్పటికే డ్యామేజి అయిన కన్వీయర్ బెల్ట్ కు మరమ్మత్తులు చేపట్టారు. కాగా, టన్నెల్ లోపలికి పైనుండి రంధ్రం చేసి లోపలికి వెళ్ళాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్ ) ప్రతిపాదనను తోసిపుచ్చారు. 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రేయింబగళ్లు పని చేస్తున్నాయి.

టన్నెల్ లో సహాయ కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉదయం నుండి దోమలపెంట ప్రాజెక్టు సైట్ లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం జెపి కార్యాలయంలో సహాయ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , స్థానిక ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఆర్మీ, నేవి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆరెఫ్,, నవయుగ, ఎస్ సి సి ఎల్, జేపి సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం విలేకరులతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, టన్నెల్ లో చిక్కుకున్నవారిని వెలికితీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికీ వారు సజీవంగా ఉన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్ లో చిక్కుకున్న ఒక అధికారి మొబైల్ ఫోన్ రింగ్ అయిందని, దాని ప్రకారం సిగ్నల్ తో వారి లొకేషన్ గుర్తించామన్నారు. మంత్రి వెంట నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ పలువురు అధికారులు ఉన్నారు.