SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఘటన 16వ రోజు కొనసాగుతుంది. GPR, క్యాడవర్ డాగ్స్‌లతో మార్క్ చేసి మృతదేహాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. డీ వాటరింగ్, టీబీఎం మిషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ ఆపరేషన్‌లో కీలక పురోగతి లభించింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లను గుర్తించారు. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ లభించిన కడియం ఆధారంగా.. గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా గుర్తించారు.
బయటకు తీసిన మృతదేహాలను అంబులెన్సుల ద్వారా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు నాగర్ కర్నూల్ నందు హాస్పిటల్ కి వెళ్లి అంబులెన్సులను, సిబ్బందిని అలర్ట్ చేశారు. ఎప్పుడైనా మృతదేహాలు బయటకు వస్తాయని డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సులు రెడీగా ఉండాలని అలర్ట్ చేశారు. టన్నెల్ లోపల భారీగా శిథిలాలు, మట్టి, బురద చేరడంతోపాటు మరో పక్క భారీగా నీళ్లు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. మృతదేహాలను వెలికితీసేందుకు అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. NDRF, SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి.