Snake bite deaths in rural Telangana : పల్లెటూళ్లలో పొలం గట్ల మీద, గడ్డివాముల వద్ద, పశువుల పాకల్లో పాములు కనిపించడం కొత్తేమీ కాదు. కానీ, మారుతున్న పరిస్థితులతో ఆ పాముల పడగ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి వస్తున్న సర్పాలు, తెలియక వాటి బారిన పడుతున్న మనుషులు.. ఇదో విషాదకరమైన ఘర్షణ. పాము కాటు వేస్తే మందు ఉంది, కానీ సరైన సమయానికి వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అసలు పల్లెల్లో ఈ సర్పగండం ఎందుకు పెరిగిపోతోంది? దేశంలో ఉన్న వందలాది పాము జాతుల్లో ఎన్ని నిజంగా ప్రమాదకరం? కాటుకు గురైన వారిని కాపాడుకోవడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నాం?
ఎందుకీ ఉపద్రవం : ఒకప్పుడు పొలాల్లో, అడవుల్లో కనిపించే పాములు ఇప్పుడు ఇళ్ల పరిసరాల్లోకి ఎందుకు వస్తున్నాయి? దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
ఆవాసాల విధ్వంసం: బీడు భూములు తగ్గిపోవడం, వ్యవసాయ క్షేత్రాలుగా మారడం, పంట పొలాల్లో క్రిమిసంహారక మందుల వాడకం పెరగడం వల్ల పాములు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి.
ఆహారం, ఆశ్రయం కోసం: దీంతో అవి ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కోసం పశువుల షెడ్లు, గడ్డివాములు, పొదలు, ఇంటి పరిసరాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో గుడ్లు పెట్టేందుకు చల్లటి, సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో అవి అత్యంత కోపంగా, ప్రమాదకరంగా ఉంటాయి.
వైద్యంలో లోపం.. ప్రాణాలకు సంకటం : పాముకాటుకు గురైన వారిలో అత్యధికులు పొలం పనులు చేసుకునే రైతులే. అయితే, వారిని కాపాడటంలో గ్రామీణ వైద్య వ్యవస్థ విఫలమవుతోందనడానికి ఈ రెండు ఘటనలే నిలువుటద్దం.
అక్షిత విషాదం: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థిని గుర్రం అక్షిత, ఇంటి ఆవరణలోనే పాముకాటుకు గురైంది. ఆమెను సుల్తానాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లినా సరైన చికిత్స అందలేదు. కరీంనగర్‌కు తరలించేలోపే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.
సమ్మయ్య పోరాటం: పెద్దకల్వల గ్రామానికి చెందిన బత్తుల సమ్మయ్య పొలంలో పాముకాటుకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చింది. రూ.2 లక్షలు ఖర్చు చేస్తే అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాలు రాత్రి వేళల్లో అందుబాటులో లేకపోవడం, సరైన ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి. జిల్లా ఆసుపత్రుల్లో పాముకాటు విరుగుడు మందులు (Anti-venom) అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా, బాధితులను గంటల వ్యవధిలో అక్కడికి తరలించడం గగనమవుతోంది.
తెలుసుకోవాల్సిన నిజాలు
అన్నీ ప్రమాదకరం కాదు: మన దేశంలో సుమారు 240 జాతుల పాములుంటే, వాటిలో కేవలం 10 జాతులకు చెందిన 52 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి. ముఖ్యంగా తాచు, కట్ల పాముల కాటు అత్యంత ప్రమాదకరం.
వాటికి చెవులుండవు: పాములకు చెవులు ఉండవు. కేవలం భూమిపై ఏర్పడే ప్రకంపనల ద్వారానే అవి ప్రమాదాన్ని పసిగట్టి, ఆత్మరక్షణ కోసం కాటు వేస్తాయి. పాము కాటుకు గురైనప్పుడు నాటు వైద్యం, మంత్రాలు వంటి మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా, వీలైనంత త్వరగా సమీపంలోని పెద్ద ఆసుపత్రికి తరలించడం ఒక్కటే ప్రాణాలు కాపాడే మార్గం. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, ప్రథమ చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే ఇలాంటి మరణాలను ఆపగలం.


