Gold prices affecting family relationships : పెళ్లిళ్లు, పేరంటాలలో బంగారు కానుకలు ఇవ్వడం, పుచ్చుకోవడం మన సంప్రదాయంలో భాగం. కానీ, పసిడి ధరలు ఇప్పుడు అదే సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నాయి. బంధుత్వాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఒకప్పుడు ఆప్యాయతకు ప్రతీకగా నిలిచిన ‘చదివింపులు’, నేడు అనుమానాలకు, అవమానాలకు, అంతరాలకు కారణమవుతున్నాయి. అసలు ఈ ‘బంగారు’ గొడవలకు కారణమేంటి…? దీనివల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయి..?
ఆకాశాన్నంటిన ధర.. అందుకు రాని బంధుత్వం : ఐదేళ్ల క్రితం తులం బంగారం ధర రూ.50 వేలు ఉంటే, ఇవాళ అది ఏకంగా రూ.1,30,000 దాటిపోయింది. ఈ అసాధారణ పెరుగుదల, మధ్యతరగతి, చిరుద్యోగుల కుటుంబాలపై పెను భారాన్ని మోపుతోంది. ముఖ్యంగా, శుభకార్యాలలో ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం, ఇప్పుడు గుదిబండగా మారింది.
నల్గొండలో ఓ చిరుద్యోగి కథ: ఆరేళ్ల క్రితం తన కూతురి పెళ్లికి బంధువులు పెట్టిన బంగారు ఉంగరాలను, అవసరానికి వాడుకున్నాడో చిరుద్యోగి. ఇప్పుడు, ఆ బంధువుల ఇంట్లో శుభకార్యం రాగా, పెరిగిన ధరలతో తిరిగి ఉంగరం చేయించలేక, వారి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈ చిన్న విషయం, రెండు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచింది.
వ్యాపారికి అనుమానం: మరో ఘటనలో, నల్గొండకే చెందిన ఓ వ్యాపారి, తన కూతురి పెళ్లికి బంధువులు పెట్టిన కానుకల్లో రెండు ఉంగరాలు నకిలీవని తేలడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎవరు మోసం చేశారో తెలియక, బంధువులందరినీ అనుమానిస్తూ, అందరికీ దూరమయ్యారు.
అంతా బంగారం కాకపోవచ్చు : శుభకార్యాలకు వెళ్లినప్పుడు, ఎదుటివారు వేసుకున్న ఆభరణాలను చూసి పోల్చుకోవడం, తక్కువగా ఫీల్ అవ్వడం చాలామందికి అలవాటు. కానీ, నిపుణులు ఏమంటున్నారంటే.. “మీరు చూసేదంతా బంగారం కాకపోవచ్చు. పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసైనా, ఎదురింటి పిన్నిగారి కాసులపేరైనా వన్-గ్రామ్ గోల్డ్ అయ్యుండొచ్చు. ప్రస్టేజ్ కోసం ఇతరులను చూసి, లేనిపోని ఆలోచనలు చేసి, మనశ్శాంతి కోల్పోవద్దు.”
మారుతున్న కాలం.. మారాల్సిన సంస్కృతి : బంగారం ధరలు ఇలాగే పెరుగుతుంటే, భవిష్యత్తులో ఈ ‘చదివింపుల’ సంప్రదాయం బంధాలను మరింత బలహీనపరిచే ప్రమాదం ఉంది. కానుక విలువ కాదు, ఆంతర్యం ముఖ్యం.. కానుకలను బ్యాంకు లాకర్లలో దాచిపెట్టినట్లుగా ఇచ్చి, ఏ పదేళ్లకో తిరిగి అదే స్థాయిలో ఆశించడం సరికాదు. ఇచ్చే వారి ఆంతర్యం, వారి ఆశీర్వాదమే ముఖ్యం.
ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి: బంగారం స్థానంలో, అవతలి వారికి ఉపయోగపడే ఇతర బహుమతులను ఇవ్వడం గురించి ఆలోచించడం మంచిది. మారుతున్న కాలానికి అనుగుణంగా, మన సంప్రదాయాలను కూడా పునఃసమీక్షించుకోకపోతే, ఈ ‘బంగారు’ మోజులో పడి, అమూల్యమైన బంధాలను కోల్పోవాల్సి వస్తుంది.


