Sunday, November 16, 2025
HomeతెలంగాణFake News : ఫార్వర్డ్ చేస్తే ఫసక్కే.. సోషల్ పోస్టుతో జీవితం జైలుపాలు!

Fake News : ఫార్వర్డ్ చేస్తే ఫసక్కే.. సోషల్ పోస్టుతో జీవితం జైలుపాలు!

Punishment for spreading false news : వాట్సాప్‌లో ఓ వార్త వచ్చిందా? వెంటనే పది గ్రూపులకు పంపించేస్తున్నారా? ఫేస్‌బుక్‌లో ఆకట్టుకునే వీడియో కనిపిస్తే ఆలోచించకుండా షేర్ చేస్తున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి! మీ వేలికొనలతో మీరు ఫార్వర్డ్ చేసే ఆ ఒక్క సందేశం మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టగలదు. గుడ్డిగా నమ్మి పంపించే పోస్టుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగితే, పంపిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్‌లు కూడా బాధ్యులవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎలాంటి పోస్టులు పెడితే నేరం? చట్టం ఏం చెబుతోంది? తెలియకుండా ఫార్వర్డ్ చేస్తే ఎదురయ్యే పరిణామాలేంటి?

- Advertisement -

సామాజిక మాధ్యమాలు మన జీవితంలో భాగమైపోయాయి. కానీ, వాటిని బాధ్యతాయుతంగా వాడకపోతే పెను ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయం. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్  వంటి వేదికలపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను, విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. మతాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే కంటెంట్‌ను సృష్టిస్తున్నారు. ఇలాంటి వాటిని నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఎందరో చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల వంటి సున్నితమైన సమయాల్లో ఇలాంటి ప్రచారాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే, జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక ‘సోషల్ మీడియా సెల్’లను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెడుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన కొన్ని కేసులు ఇవే: పాత వీడియోతో కొత్త చిచ్చు: ఎక్కడో, ఎప్పుడో పోలీసులు ఓ వ్యక్తిని కొడుతున్న పాత వీడియోను తీసుకుని, అది ఆదిలాబాద్‌లో జరిగిన ఘటనగా చిత్రీకరించి పోస్ట్ చేసిన బొక్కలగూడ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోస్టు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని గుర్తించారు.

విదేశం నుంచీ విద్వేషం: టాంజానియాలో ఉంటూ వాట్సాప్‌లో విద్వేషపూరిత పోస్టులు పెట్టిన షేక్ ఇర్ఫాన్‌ను, అతను భారత్‌కు తిరిగి రాగానే ముంబయి విమానాశ్రయంలో ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఫేక్ ఐడీతో వేధింపులు: తన సోదరి పేరుతోనే ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఖాతా సృష్టించి, ఓ మహిళ పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన గుడిహత్నూర్‌కు చెందిన ఓ యువకుడిపై కేసు నమోదైంది.

చైల్డ్ పోర్న్ వీడియోలు: సిరికొండ మండలంలో ఓ యువకుడు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూడటమే కాక, వాటిని డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కఠిన చర్యలు తీసుకున్నారు.

ఆయుధాలతో హల్‌చల్: పుట్టినరోజు వేడుకల్లో కత్తులు, డాగర్లతో ప్రదర్శన ఇస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువకుడిపై, మారణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పాత నేరస్థుడు కైంచీ సలీంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

చట్టం ఏం చెబుతోంది? (భారతీయ న్యాయ సంహిత – బీఎన్‌ఎస్‌ ప్రకారం)

సెక్షన్ 196: మత, వర్గ, జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ప్రచారాలు చేస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు.
సెక్షన్ 353: ఇతరుల పరువుకు భంగం కలిగించేలా, అవమానపరిచేలా పోస్టులు పెడితే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
సెక్షన్ 78: మహిళల గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తించడం లేదా పోస్టులు పెట్టడం నేరం.
66-డి ఐటీ యాక్ట్: సోషల్ మీడియాను, కంప్యూటర్ వనరులను దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడటం.

“సోషల్ మీడియాలో మీ ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టడం సరికాదు. అసత్య ప్రచారం, మతపరంగా, వర్గ విభేదాలు సృష్టించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు. గ్రూపుల్లో వచ్చే సమాచారం ఏదైనా నిజానిజాలు తెలుసుకోవాలి. తప్పుడు పోస్టులు మీ గ్రూపులో వస్తే వెంటనే మాకు సమాచారం అందించండి. ఈ ఏడాది ఆదిలాబాద్‌లో ఇలాంటివి 53 కేసులు నమోదు చేశాం,” అని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad