Friday, December 12, 2025
HomeTop StoriesTelangana Tourism: కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల అందాలు.. సోమశిల టు శ్రీశైలం.. అద్భుత జలవిహారం!

Telangana Tourism: కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల అందాలు.. సోమశిల టు శ్రీశైలం.. అద్భుత జలవిహారం!

Somasila to Srisailam boat trip : సోమశిల, శ్రీశైలం, లాంచీ ప్రయాణం పచ్చని నల్లమల కొండల మధ్య, వెండి వెలుగులు చిమ్ముతూ పరవళ్లు తొక్కే కృష్ణమ్మ ఒడిలో సాగే ప్రయాణం.. అదొక అద్భుతమైన అనుభూతి. ఒకవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మిక పరిమళం.. ఈ రెండింటినీ మేళవించి తెలంగాణ పర్యాటక శాఖ అందిస్తున్న సోమశిల-శ్రీశైలం లాంచీ విహారం పర్యాటకులను మరోసారి పలకరించేందుకు సిద్ధమైంది. కార్తీక మాసపు శోభలో, మల్లికార్జునుడి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ ప్రయాణం ఓ మధురానుభూతిని పంచనుంది. అసలు ఈ జలవిహారంలో ప్రకృతి మనకు ఎలాంటి అద్భుతాలను చూపిస్తుంది? దారిలో కనిపించే ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రత్యేకతలేంటి? టికెట్ ధరలు, ప్రయాణ వివరాలు ఏమిటి?

- Advertisement -

ఎంతో కాలంగా పర్యాటకులు ఎదురుచూస్తున్న, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలానికి సాగే లాంచీ ప్రయాణం శనివారం పునఃప్రారంభమైంది. తొలిరోజు 65 మంది పర్యాటకులతో లాంచీ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచే ఈ యాత్ర వివరాలు..

ప్రయాణమంటే ఇదేరా.. అడుగడుగునా ఆనందమే :

ప్రారంభం – ప్రణాళిక: ఈ లాంచీ సేవలు వారానికి మూడుసార్లు, అనగా ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 9 గంటలకు సోమశిల నుంచి బయలుదేరుతాయి. సుమారు ఆరు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో పర్యాటకులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి నిర్వాహకులే అందిస్తారు. పెద్దలకు టికెట్ ధర రూ.2,000, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణం ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి ఉంటుంది.

ప్రకృతి ఒడిలో పయనం: ప్రయాణం మొదలైన కాసేపటికే, కృష్ణమ్మకు పచ్చల పతకం పొదిగినట్లుండే అమరగిరి ద్వీపం కనువిందు చేస్తుంది. ఆ తర్వాత కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల భారీ నిర్మాణాలను దాటుకుంటూ లాంచీ ముందుకు సాగుతుంది. నల్లమల కొండలను చీల్చుకుంటూ, పచ్చదనం మధ్య మలుపులు తిరుగుతూ సాగే కృష్ణానది అందాలను చూస్తూ మైమరచిపోవడం ప్రయాణికుల వంతవుతుంది. చీమలతిప్ప ద్వీపం, అంకాలమ్మ గుడి వంటి ప్రదేశాలు యాత్రకు మరింత శోభను చేకూరుస్తాయి.

అక్కమహాదేవి గుహల్లో ఆధ్యాత్మిక స్పర్శ: శ్రీశైలం సమీపిస్తుందనగా, పాతాళగంగకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక అక్కమహాదేవి గుహల వద్ద లాంచీ ఆగుతుంది. 12వ శతాబ్దంలో పరమ శివభక్తురాలైన అక్కమహాదేవి ఇక్కడ తపస్సు చేశారని స్థల పురాణం. సన్నని, చీకటి దారుల్లో జాగ్రత్తగా లోపలికి వెళితే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

గమ్యం శ్రీశైలం: అక్కమహాదేవి గుహల్లో కాసేపు గడిపిన తర్వాత, మరో అరగంట ప్రయాణంతో లాంచీ శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడి నుంచి పర్యాటకులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. రోడ్డు మార్గంలో ప్రయాణించే రణగణ ధ్వనులకు దూరంగా, కృష్ణమ్మ చల్లని గాలుల మధ్య సాగే ఈ ప్రయాణం కుటుంబంతో కలిసి వెళ్లేవారికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

బుకింగ్  వివరాలు : ఈ అద్భుతమైన ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్ కోసం తెలంగాణ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్ http://www.tgtdc.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News