చురుకుదనం, అంకితభావాన్ని ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లలోని సిబ్బందికి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 11 మంది ఉద్యోగులకు “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులు, సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో ప్రదానం చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్. భద్రతా సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం సాగింది.
సమీక్షా సమావేశంలో..
ఈ సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, ఆరు డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్‌లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ జోన్ పరిధిలోని వివిధ డివిజన్ లకు చెందిన 11 మంది ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తతను ప్రదర్శించినందుకు, అసురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకు : సికింద్రాబాద్ డివిజన్ – 02 , హైదరాబాద్ డివిజన్ -01, విజయవాడ డివిజన్ -03, గుంతకల్లు డివిజన్ -04 మరియు గుంటూరు డివిజన్ -01 “ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్” భద్రతా అవార్డులను అందజేశారు.
అవార్డు గ్రహీతల్లో..
ఈ అవార్డు గ్రహీతల్లో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మెయింటెయినర్లు లాంటి వివిధ వర్గాలకు చెందిన ఉద్యోగులున్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతల విధుల నిర్వహణలో వారి చిత్తశుద్ధి, నిబద్ధతను అభినందించారు. ఈ అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో ఇతర ఉద్యోగులకు ప్రేరణగా నిలుస్తాయని, అలాగే రైళ్లను సురక్షితంగా నడిపేందుకు రైల్వేలకు కూడా ఎంతో సాయపడతాయన్నారు.
క్షేత్రస్థాయి సిబ్బందికి కౌన్సిలింగ్..
రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షించారు అరుణ్ కుమార్ జైన్. జోన్ వ్యాప్తంగా చేపడుతున్న వివిధ సేఫ్టీ డ్రైవ్‌ల స్థితిగతులపై ఆయన సమీక్షించి, ఏదేని సూక్ష్మ లోపాలుంటే వీలైనంత త్వరగా సరిదిద్దాలని అధికారులకు సూచించారు. సూపర్‌వైజర్లు , లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లతో క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ సెషన్‌లను నిర్వహించాలని, ఎటువంటి షార్ట్ కట్ పద్ధతులను అవలంభించకూడదని, ఖచ్చితంగా అన్ని సమయాల్లో భద్రతా విధానాలకు అనుగుణంగా ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బందికీ ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
వివరణాత్మక ప్రదర్శన..
ఆర్.ఎల్.డి.ఏ (రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి తాము అమలు చేస్తున్న వివిధ రైలు అభివృద్ధి ప్రాజెక్టుల స్థితిగతులపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. విజయవాడ, గుంటూరు డివిజన్‌ల డివిజనల్ రైల్వే మేనేజర్‌లు తమ జోన్‌లు చేపట్టిన ఆవిష్కరణలు/పనితీరుపై జనరల్ మేనేజర్ కు వివరించారు.