తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad) వివరణ ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతున్న సమయంలో రన్నింగ్ కామెంట్రీ చేస్తుండంటతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని.. అప్పుడు తనకే వినాలనిపించడం లేదని మీకు వినిపిస్తుందా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి మాట్లాడినవేనని సునీతా లక్ష్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాను అనుకోలేదని సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. తన మనసుకు బాధ కల్గించిందని.. తన వ్యాఖ్యలను స్పీకర్ విత్ డ్రా చేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్.. మహిళలంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. రన్నింగ్ కామెంట్స్ చేస్తుండగా అందరు ఒకేసారి మాట్లాడుతున్నారని.. ఆ సమయంలో తనకే వినబుద్ది కావడం లేదు మీకు వినిపిస్తుందా? అన్నాను అని వివరించారు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. ఒకవేళ మీకు బాధ కల్గిస్తే ఆ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నానని చెప్పారు.