Wednesday, January 14, 2026
HomeతెలంగాణFree education : జత బట్టలతో రండి.. ఉచిత విద్య, వసతితో బంగారు భవిష్యత్తును పొందండి!

Free education : జత బట్టలతో రండి.. ఉచిత విద్య, వసతితో బంగారు భవిష్యత్తును పొందండి!

Free residential education for poor students : పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు.. ఆర్థిక ఇబ్బందులు ఆశలకు సంకెళ్లు వేయకూడదు! ఈ మహోన్నత లక్ష్యంతో, సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్ట్, నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. కేవలం ఒక జత దుస్తులతో వస్తే చాలు, 6వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు, సంపూర్ణ ఉచిత విద్య, వసతి, భోజనాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. 

- Advertisement -

‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’లో భాగంగా, శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్ట్, 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం ఈ గురుకులాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్య, ఆరోగ్యం, పోషకాహారం అన్నీ ఉచితమే.

కేవలం చదువే కాదు.. సంపూర్ణ వికాసం : ఈ గురుకులంలో కేవలం అకడమిక్ విద్యకే పరిమితం చేయకుండా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంగ్లీష్ మీడియంలో (NIOS విధానంలో) ఏడేళ్ల పాటు ఉచితంగా బోధిస్తారు.

నైపుణ్యాలు: విద్యార్థుల ఆసక్తిని బట్టి సంగీతం, నాట్యం, క్రీడలు, కంప్యూటర్ అప్లికేషన్స్, డ్రైవింగ్, వంటలు వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. భారతీయ సనాతన సంప్రదాయాలకు అనుగుణంగా, భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలను బోధిస్తూ, విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందిస్తారు.

పీహెచ్‌డీ వరకు అండగా : ఇక్కడ ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను వదిలిపెట్టరు. శ్రీసత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా, వారికి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఉచితంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. పీజీ విద్యార్థులకు ప్రతి నెలా ఉపకార వేతనం కూడా అందిస్తారు.

ప్రవేశాలు ప్రారంభం.. గడువు జనవరి 20 : ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు srisathyasailokasevagurukulam.org/admissions-2026-27/ అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 20. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని అర్హులైన నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, వారి జీవితాలను మార్చుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. క్యాంపస్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ssspnk.org వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News