స్థానిక యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలన్న ఏకైక ధ్యేయంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఈనెల 9న మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ జాబ్ మేళా లో సుమారు 10 ఐటి కంపెనీలు పాల్గొంటున్నాయని, 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిల్పారామంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువతి, యువకులు ముఖ్యంగా డిగ్రీ, ఐటి, ఇంజనీరింగ్ ఆపై చదివిన అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు నని ఆయన స్పష్టం చేశారు .
9 న నిర్వహించనున్న జాబ్ మేళా పై సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కూలీలు, లేబర్, పాలమూరు కూలీలకు ప్రపంచ ప్రసిద్ధి అని , అలాంటిది ఇప్పుడు మహబూబ్ నగర్ లోనే ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడ వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇందులో భాగంగానే మొదటి విడతన 10 కంపెనీలు 9 న సుమారు 650 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నాయని తెలిపారు.
జువేన్ టెక్నాలజీస్ ఇంక్, ముల్లెర్ డాట్ కనెక్ట్, అర్పన్ టెక్ ,ఐటివిజన్ 360, అమర రాజా, భారత్ క్లౌడ్, సీగ్రోవ్ సిస్టమ్స్, ఫోర్ ఓక్స్, ఎస్ 2,ఇంట్యూట్స్ తదితర కంపెనీలు ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రారంభ దశలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.వచ్చే సంవత్సరం అమర రాజా ద్వారా మరో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. హన్వాడలో ఫుడ్ పార్కును సైతం ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. చదువుకున్నవారందరికీ ,అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ అభిమతమని తెలిపారు.మహబూబ్ నగర్ లో ఐ టి కారిడార్ ఏర్పాటు కావడం,జాతీయ రహదారి,శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో ఉండడం, షాద్ నగర్ వరకు మెట్రో రైలు సేవలు రానున్న దృష్ట్యా భవిష్యత్తులో దీవిటిపల్లి ఐ టి కారిడార్ కు మెట్రో రైళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ ను మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దనున్నామని మంత్రి వెల్లడించారు. ఐటీ టవర్ నుండి మహబూబ్ నగర్ పట్టణం వరకు 100 ఫీట్ల బైపాస్ రహదారి త్వరలో పూర్తి చేయనన్నామని ఆయన.
గతంలో మహబూబ్ నగర్ లో ఒక్క ఇండస్ట్రీ ఉండేది కాదని, బతుకుదెరువు కోసం తప్పనిసరిగా ఊరు విడిచి వెళ్లేవారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటి కారిడార్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్, రాష్ట్ర ప్రభుత్వ ఐటి ఇన్వెస్ట్ సీఈవో విజయ రంగినేని, జిల్లా ఎస్పీ కే. నరసింహ తదితరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.