మహబూబ్ నగర్లోని శిల్పారామంలో నిర్వహించిన జాబ్ మేళాలో 700 నుండి 800 స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నమని, సెప్టెంబర్ 2 న నిర్వహించే మెగా జాబ్ మేళాలో జిల్లాలోని 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
టాస్క్ ఆధ్వర్యంలో బుధవారం మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఒకప్పుడు బతుకుదేరువు కోసం మహబూబ్నగర్ నుండి దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు, ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, ప్రపంచంలో పాలమూరు లేబర్ అంటే ప్రఖ్యాతి అని, ఎక్కడ నిర్మాణ పనులు జరిగిన పాలమూరు లేబర్ కనిపించేవారని అన్నారు .అంతేకాక అతి తక్కువ అక్షరాస్యత, ఆకలి చావులు ఇక్కడే వుండేవని, అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక అలా ఉండిపోయాయని, ముఖ్యంగా శిల్పారామం చెత్తాచెదారంతో, పెద్ద చెరువు కట్ట కాలు మోపడానికి కూడా సందులేని విధంగా ఉండేదని, మహబూబ్నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ,ఇలాంటి ఇబ్బందులు అన్నిటిని అధిగమించి జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో దివిటి పల్లి వద్ద ఐటీ కారిడార్ ను నెలకొల్పామన్నారు. దానిద్వారా టాస్క్ ఆధ్వర్యంలో 10 కంపెనీలను నుండి 700 నుండి 800 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మొదటి విడత మహబూబ్నగర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సెప్టెంబర్ 2న 100 కంపెనీలతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా మరో మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామని ఆ జాబ్ మేళాలో జిల్లాలోని వారందరికీ అవకాశాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
మహబూబ్నగర్ ఐటి టవర్ లో దేశంలోనే అతి పెద్దదైన లిథియం బ్యాటరీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని, యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం పాకులాడకుండా ప్రైవేటు ఉద్యోగాలలో సైతం చేరాలని కోరారు, మొత్తం జనాభాలో రెండు శాతం జనాభాకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, ప్రైవేట్ కంపెనీలలో సైతం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం మహబూబ్నగర్ పారిశ్రామికంగా, పర్యాటకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నదని, దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాలలో అర్బన్ ఎకో పార్కును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే జంగిల్ సఫారీ ప్రారంభించనున్నామని, హన్వాడలో ఫుడ్ పార్క్ రానుందని, మినీ ట్యాంక్ బండ్ లో సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్, ఏసీ బోట్ ఏర్పాటు చేస్తున్నామని, శిల్పారామం ఆవరణలో అతిపెద్ద వండర్ లా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ నెల 13 న మినీ ట్యాంక్ బండ్ పై 650 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఈ ప్రదర్శనను అందరూ తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. బుధవారం నాటి జాబ్ మేళాకు హాజరై ఉద్యోగం రానివారు తిరిగి సెప్టెంబర్ 2 న నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావాలని ఆయన కోరారు. జాబ్ మేళాకు హాజరైన వారందరి వివరాలను సేకరించి సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు.
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా కంపెనీల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చారని ,యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చిన ముందుగా ఉద్యోగంలో చేరాలని, ఆ ఉద్యోగం చేసుకుంటూనే ఇతర ఉన్నతమైన ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో విద్యార్థులకు తగ్గట్టుగా ఉద్యోగం దొరుకుతుందని, ఎవరికైనా నైపుణ్యం లేనట్లయితే అలాంటి వారికి నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారన్నారు.
మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ,ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతుబంధు డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు గోపాల్, అడిషనల్ ఎస్పి రాములు, ఆర్డీవో అనిల్ కుమార్ ,ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ యాదయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.