పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండేలా చూడాలని… మొబైల్ గేమ్స్ కంటే ఆటపాటలతో పిల్లలు మరింత చురుగ్గా తయారవుతారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి, బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పిల్లలమర్రి బాలోత్సవ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల చేత ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… విద్యార్థులు మట్టిలో మణిక్యాలని అన్నారు. తల్లిదండ్రులు చిన్నారుల మనోభావాలను అర్థం చేసుకొని చదువుతోపాటు ఆటపాటల్లోనూ ప్రోత్సహించాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామాన్ని చిన్నారుల భూతల స్వర్గంగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు.
త్వరలో శిల్పారామం కిడ్స్ గేమ్ జోన్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. నక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ ను అద్భుత పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. చిన్నారుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన పిల్లలమర్రి బాలోత్సవ్ చక్కని కార్యక్రమం అని మంత్రి కితాబునిచ్చారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, డీసీసీబీ ఇంచార్జీ చైర్మన్ కే వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, బాలోత్సవ్ కమిటీ చైర్మన్, పీపీ బెక్కెం జనార్దన్, ప్రధాన కార్యదర్శి డా ప్రతిభ, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ వనజ, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు జగపతిరావ్, దోమ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.