హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా మహబూబ్ నగర్ ను చేయాలనేది తమ ధ్యేయమని రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ బీఎడ్ కళాశాల గ్రౌండ్స్ లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మార్నింగ్ వాక్ చేశారు. మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచారు. కాసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. గత పదేళ్లలో మహబూబ్ నగర్ లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ప్రతిఒక్కరు ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని,ఎవరి వల్ల అయితే మనకు రక్షణ కలుగుతుందో చూసి ఓటు వేయాలని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో ఆలోచించండని, పదేళ్లుగా ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది తెలుసుకోండని ప్రజలకు సూచించారు.
మహబూబ్ నగర్ లో ప్రజల ఆస్తులకు ఎవరు విలువ పెంచారో గమనించండని అన్నారు.హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తామని అందుకు మీ ఆశీర్వాదం కావాలని ప్రజలతో విన్నవించారు.హైదరాబాద్ లో మహబూబ్ నగర్ ను ఓ భాగంగా చేయాలనేది తమ ధ్యేయం అన్నారు. హైదరాబాద్ లో ఉండే సౌకర్యాలు, వసతులు కల్పిస్తాం అని తెలిపారు. హైదరాబాద్ లో లేని విధంగా మన్యంకొండ రోప్ వే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే అతి పెద్ద ఎనర్జీ పార్క్ మన దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేశామని అన్నారు.తమిళనాడు తరలిపోతున్న క్రమంలో కేటీఆర్ ద్వారా ఒప్పించి రూ.10 వేల కోట్ల పెట్టుబడితో అమర రాజా లిథియం అయాన్ గిగా పరిశ్రమను మహబూబ్ నగర్ తీసుకువచ్చాం అని పేర్కొన్నారు.జేఎన్టీయూ క్యాంపస్ ను సుమారు 100 ఎకరాల్లో అత్భుతంగా నిర్మిస్తామని,మహబూబ్ నగర్ మున్సిపాలిటీని దివిటిపల్లి వద్ద హైవే వరకు విస్తరిస్తామని,భవిష్యత్తులో మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్లను కలిపి గ్రేటర్ మహబూబ్ నగర్ చేస్తాం అన్నారు.మహబూబ్ నగర్ స్టేడియంను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాంఅని తెలిపారు.
కాంగ్రెస్ వాళ్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి12 ఏళ్లలో కడితే… మేం రెండో బ్రిడ్జిని 12 నెలల్లో నిర్మించాం అన్నారు.14 రోజులకు ఒకసారి వచ్చే తాగునీటి సమస్యను పరిష్కరించి వందేళ్ల వరకు తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. ఆధునిక స్మశాన వాటిక, అనాధ వసతిగృహం, సెయింట్ సాప్ట్ వేర్ కంపెనీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్ధం అవుతున్నాయని, పట్టణాన్ని ప్రశాంతంగా ఉండేలా చేయడం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తాం అన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు సంబంధించిన పెద్ద పెద్ద కాలువలు మహబూబ్ నగర్ పట్టణాన్ని దాటి వెళ్తాయన్నారు.పట్టణం చుట్టూ బైపాస్ వస్తుంది.బైపాస్ చుట్టూ మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం అన్నారు. ఫోర్జరీ సంతకాలు చేసినందుకు అరెస్ట్ చేస్తే కూడా తప్పుడు ఆరోపణలు చేసే దుర్మార్గుల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.మహబూబ్ నగర్ లో ఇలాంటి దుర్మార్గులకు చోటు ఉండదన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, స్థానిక కౌన్సిలర్ తిరుమల రోజా వెంకటేష్, తదితరులు ఉన్నారు.