హైదరాబాద్ కమిషనరేట్ కు కొత్త కొత్వాల్ వచ్చారు. సుదీర్ఘ కాలం తరువాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమీషనరుగా నియమితులయ్యారు. దీంతో లాంఛనంగా తన పదవీ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని టీఎస్ ఐసిసిసి భవనంలో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో నక్సలిజంపై ఉక్కుపాదం మోపి అణచివేయడంలో శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఆపరేషన్స్ డీజీగా పనిచేసిన ఆయన తరువాత అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్స్,లీగల్ గా బదిలీ అయ్యారు. గత కొద్ది నెలలుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం హైదరాబాద్ కమిషనరేట్ బాధ్యతలను అప్పగించింది. 143 ఎకరాల గ్రేహౌండ్స్ భూపరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా 12వేల మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ఇచ్చేందుకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2010లో ఆయన అందించిన ఉత్తమ సేవలకు ఇండియన్ పోలీస్ మెడల్ వరించింది. 2019లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, 2023లో అతి ఉత్కృష్ట్ అవార్డులు దక్కించుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి హైదరాబాద్ నగరం ఎన్నో సవాళ్లను విసురుతుంది. ప్రధానంగా వీసా గడువు ముగిసిన విదేశీయులు, డ్రగ్స్ ముఠాల కార్యకపాలు, మహిళల అక్రమ రవాణా ముఠాలు వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. వాటిని నిర్వీర్యం చేసి హైదరాబాద్ నగర శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్య భూమికను పోషిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.