Srisailam Temple: శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసం ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఈఓ శ్రీనివాసరావు సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి వసతి, దర్శనాలు, ఆలయ వేళలు, స్వామి అమ్మవార్లకు నిర్వహించాల్సిన ఆర్జిత సేవలు సహా పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
శ్రీశైలంలో కార్తీక మాసం ఉత్సవాల సందర్భంగా ప్రతి కార్తీక సోమవారం, శుక్రవారం కృష్ణమ్మకు హారతి, శుద్ధ ఏకాదశి రోజున కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహిస్తామని చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, పుణ్యనదీ హారతి ఏర్పాట్లతో పాటు ఈ పవిత్ర మాసంలో ఆకాశ దీపం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-heritage-buildings-restoration-project-kussad/
ఈ సందర్భంగా ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలకు ముందే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ 15 వరకే ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలి. ఉత్సవాల్లో ప్రతీ కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశితో పాటు ప్రభుత్వ సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ మేరకు ఆయా రోజుల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలి. పాతాళగంగ వద్ద శౌచాలయాలు, దుస్తులు మార్చుకునే గదులతో పాటు మెట్ల మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలి. గంగాభవానీ స్నానఘట్టాల వద్ద సైతం మరమ్మతులు చేయించాలి.’ అని ఆయా విభాగాల అధికారులకు సూచించారు.
కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో వేకువ జామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరువనున్నట్లు ఈఓ తెలిపారు. ప్రాతఃకాల పూజల అనంతరం 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు చెప్పారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు రాత్రి 10.30 గంటల వరకు దర్శనాలు ఉంటాయని.. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ నిలిపివేస్తున్నట్లు వివరించారు. గర్భాలయ అభిషేకాలను సైతం నిలిపివేయనున్నట్లు చెప్పారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-heavy-rains-alert-yellow-warning-next-three-days/
సామూహిక అభిషేకాల నిలిపివేత
సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి సహా 15 రోజులు సామూహిక అభిషేకాలను నిలిపివేయనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో అభిషేకాలు సైతం పరిమితంగానే నిర్వహిస్తామని చెప్పారు. అలాగే, అన్నప్రసాద వితరణ భవనంలో ఉదయం 10.45 గంటల నుంచి అన్నదాన ప్రసాదం పంపిణీ ఉంటుందని.. సాయంత్రం 7 గంటల నుంచి అల్పహారం అందుబాటులో ఉంటుందన్నారు. క్లూకాంప్లెక్స్‌లో భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు సమావేశంలో వివరించారు.
‘కార్తీక మాసంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన లడ్డూ ప్రసాదం సిద్ధం చేయాలి. అదనంగా విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. మొత్తం పది కౌంటర్ల ద్వారా ప్రసాదాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలి. కార్తీక మాసంలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో పాతాళగంగ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. అదనంగా లైటింగ్ ఏర్పాటు చేయాలి. భక్తుల భద్రత కోసం పాతాళగంగ వద్ద గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండాలి. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అవసరమైన చోట్ల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.’ అని అధికారులకు ఈఓ సూచించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/street-lights-maintenance-revanth-key-decisions/
కోటి దీపోత్సవం
పవిత్ర కార్తీక ఉత్సవాల సమయంలో అఖండ శివభజనలు నిర్వహిస్తామని ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గంగాధర మండపం వద్ద కూడా సైతం ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. నవంబర్ 24న, కార్తీక పౌర్ణమి రోజున కృష్ణమ్మ నదీహారతి కార్యక్రమం నిర్వహించడంతో పాటు విశేష పూజలు చేసి.. సారె సమర్పిస్తామని వివరించారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు.
కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ అన్నారు. గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణ కార్యక్రమం, ఉత్సవాలు జరిగే నెల రోజుల పాటు ఆలయ కళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజుల్లో పుష్కరిణి వద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయన్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ ఆర్ రమణమ్మ, ప్రధాన అర్చకులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆయా విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


