Saturday, November 15, 2025
HomeతెలంగాణSrisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద.. 10 గేట్లు ఎత్తివేత, దిగువకు భారీగా...

Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద.. 10 గేట్లు ఎత్తివేత, దిగువకు భారీగా జల విడుదల

Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో దాదాపు ఒకే స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.50 అడుగులకు చేరింది. ఇది ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యానికి చేరువలో ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను, ఇప్పుడు 196.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదను నియంత్రించేందుకు, అధికారులు పది స్పిల్‌వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు 4,18,060 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత
కేవలం గేట్ల ద్వారానే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,775 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే, రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 4,71,386 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 5,05,150 క్యూసెక్కులుగా నమోదైంది.

విస్తారంగా వర్షాలు..
జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ, అదనపు వరద వస్తే తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురిసి, శ్రీశైలం నిండటంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు కూడా భారీగా వరద ప్రవాహం చేరుతోంది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి విషయంలో భరోసా లభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad