Monday, November 17, 2025
HomeTop StoriesCM Revanth Reddy: 'ఎస్సారెస్పీ రెండోదశకు దామోదర్‌రెడ్డి పేరు.. 24 గంటల్లో జీవో'

CM Revanth Reddy: ‘ఎస్సారెస్పీ రెండోదశకు దామోదర్‌రెడ్డి పేరు.. 24 గంటల్లో జీవో’

Condolence Meeting: ఎస్సారెస్పీ రెండో దశ కోసం దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎంతో పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అతని సేవలకు గుర్తుగా ఆ కాలువకు ఆర్‌డీఆర్‌ ఎస్సారెస్పీ స్టేజీ-2గా నామకరణం చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు 24 గంటల్లో జీవో ఇస్తామని సీఎం అన్నారు. ఈ ప్రాంత కార్యకర్తల, ప్రజల కోరిక మేరకే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరును పెట్టినట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన దామోదర్‌రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. టైగర్‌ దామన్నగా పేరుగాంచిన దామోదర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

గోదావరి జలాల కోసం పోరాటం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దామోదర్‌రెడ్డి మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను సైతం అమ్ముకున్న నిస్వార్థ నాయకుడు ఆయనని కొనియాడారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్‌రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గోదావరి జలాల కోసం ఉద్యమించి, ఎస్సారెస్పీ స్టేజీ-2 ద్వారా నల్గొండ జిల్లాలో.. నీటి కష్టాలు తీర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. పార్టీ కోసం రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలు జోడెద్దుల్లా పనిచేశారని తెలిపారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/congress-party-focus-on-organizational-development-in-booth-level/

ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పేదల సమస్యలు తీర్చే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినకాలంలో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుండి నడిపించారని భట్టి అన్నారు. యువత రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప నాయకుడు మన దామన్న అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దామోదర్‌రెడ్డి సంతాప సభ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News