Local Body Elections SEC: తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.
హైకోర్టు ఆదేశాల మేరకే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియ నిలిపివేసినట్లు వెల్లడించింది. తదుపరి నోటిఫికేషన్ ఇచ్చేవరకు ఎన్నికల ప్రక్రియలన్నీ నిలిపివేసినట్లు వివరించింది.
కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నెం-9 ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో ప్రకారం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎస్‌ఈసీ.. ఈ రోజు తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో నిన్న, ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం.. స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.


