Kadiyam Srihari react on Rajaiah comments: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యలపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సంస్కారం సభ్యత లేకుండా తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. రాజకీయాలు మాట్లాడాల్సిన చోట వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్గుమాలిన పనులు చేసే వారి విమర్శలకు స్పందించాలంటే బాధేస్తోందని కడియం శ్రీహరి అన్నారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. జనగామలో ఇటీవల కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే తాటికొండ రాజయ్య వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘటుగా స్పందించారు.
నియోజకవర్గానికి చెడ్డ పేరు: సంస్కారం సభ్యత లేకుండా కొందరు విమర్శలు చేస్తున్నారని తాటికొండ రాజయ్యని ఉద్ధేశించి అన్నారు. వాళ్లు మాట్లాడిన మాటలు వింటే సిగ్గేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నాకు కూడా బూతులు వచ్చని అన్నారు. నేను కూడా ఇక్కడే పెరిగానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి మాట్లాడలేక పోతున్నానని అన్నారు. 15 ఏళ్లు స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు తాటికొండ రాజయ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కడియం శ్రీహరి అన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా తీరుస్తానని తెలిపారు.
కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు:స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. కడియం శ్రీహరికి సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని రాజయ్య అన్నారు. వరంగల్ పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేసి రా అంటూ పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు.


