Subsidy for vegetable cultivation: రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు అందించే పథకాలతో పాటు మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొంది. ఈ కొత్త పథకం ద్వారా లక్షలాది మంది రైతులు ప్రత్యక్షంగా లబ్ది పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.
రైతుల కోసం మరో కీలక పథకం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు, రుణమాఫీ, యంత్రాలు కొనుగోలులో సబ్సిడీ లాంటి గొప్ప పథకాలను అమలు చేస్తుంది. అయితే తాజాగా మరో కీలక పథకాన్ని రైతులకు అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రైతులకు ఎకరానికి రూ. 9600 చొప్పున సబ్సిడీ రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతుల కళ్లలో ఆనందం చిగురించనుంది. అయితే ఈ సబ్సిడీ అన్ని పంటలకు అమలు కాదు. కేవలం కొన్ని పంటలకు మాత్రమే అమలు అవుతాయి. అయితే ఆ పంటలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కూరగాయల సాగుకు సబ్సిడీ: రాష్ట్రంలో ఉంటున్న జనాభాకు సరిపోను కూరగాయలు ప్రస్తుతం అందుబాటులో ఉండటం లేదు. అందుకే రేవంత్ ప్రభుత్వం కూరగాయల సాగుకు సబ్సిడీ అందించే వినూత్న నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 10,000 ఎకరాలలో కూరగాయల సాగు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. అందుకోసం కూరగాయలు సాగు చేసే రైతుకు.. మొత్తం పెట్టుబడిలో 40% సబ్సిడీ కింద ఇచ్చేందుకు సిద్ధమైంది.
Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-paddy-dryer-machines-unused-farmers-losses/
26 లక్షల టన్నుల కూరగాయలు అవసరం: సాధారణంగా ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయలను సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. దీనికి సుమారు ఎకరాకు రూ. 24,000 ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ పెట్టుబడిలో 40% అనగా రూ. 9600 రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం తెలంగాణలో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే కూరగాయలను సాగు చేసే రైతులను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది.
రైతులు సబ్సిడీని పొందే విధానం: ఈ సబ్సిడీని పొందాలంటే రైతులు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారి వద్దకు వెళ్లాలి. తాము పండించే పంటకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తును అధికారులు పరిశీలించి రైతుల జాబితాను తయారు చేస్తారు. ఆ తర్వాత వారికి ఎకరానికి అయ్యే ఖర్చులో 40% అనగా రూ. 9,600 రైతుల ఖాతాలో జమ చేసేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ రెండున్నర ఎకరాల్లో సాగు చేసే పంటకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఉదాహరణకు పది ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తే అతనికిరెండున్నర ఎకరాల సాగుకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది.


