బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs) అనర్హతపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకు అనడమా? అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య విధానాలకు సరైన సమయం అవసరం అని అభిప్రాయపడింది. నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలో చెప్పండని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదిని అడిగింది. అనంతరం ఈ కేసుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంకు నోటీసులు జారీచేసింది. మార్చి 22 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.
కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిని కలిపి సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది.