Medicover Hospital| సమాజంలో వైద్య వృత్తిని దైవంగా భావిస్తారు. జబ్బు వస్తే ఆసుపత్రికి వచ్చే ప్రజలు డాక్టర్లను దేవుడిలా కొలుస్తారు. ప్రాణాలు నిలబెట్టే పవిత్రమైన వృత్తిలో ఉన్న కొంతమంది డాక్టర్లు ఆ వృత్తికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కాసుల కక్కుర్తి మాయలో పడి ప్రజలను పీక్కుతింటున్నారు. ఇలాంటి వైద్యులను దృష్టిలో పెట్టుకునే రెండు దశాబ్దాల క్రితం ఠాగూర్ మూవీలో ఓ సీన్ తీశారు. అయినా కానీ కాసుల వైద్యులకు బుద్ధి రాలేదు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారు చనిపోయినా.. డబ్బులు కోసం కుటుంబసభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఠాగూర్ సీన్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో జూనియర్ డాక్టర్ నాగప్రియ మెడికవర్ ఆసుపత్రిలో చేరింది. అమెకు వైద్యులు చికిత్స అందిస్తుండగా నిన్న(మంగళవారం) రాత్రి మృతి చెందింది. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.3 లక్షలకు పైగా డబ్బు కుటుంబసభ్యులు చెల్లించారు. అయితే మరో రూ. 4 లక్షలు కడితేనే ట్రీట్‌మెంట్ కొనసాగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకున్నా కూడా యాజమాన్యం లెక్క చేయలేదు.
దీంతో కుటుంబసభ్యులు ఎంతో కష్టపడి ఉదయం మరో రూ.లక్ష కట్టారు. ఆ వెంటనే నాగప్రియ చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డబ్బు కోసమే మృతి వార్తను దాచిపెట్టారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు మామూలు అయిపోయాయని.. వైద్యానికి వచ్చిన రోగుల బంధువులను మానసికంగా డబ్బు కోసం హింసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.