నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని, మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని అంటున్నారు కానీ ఇక్కడ అవేమి కనిపించడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని రాజీవ్ , ఇందిరమ్మ కాలనీలో పట్టణ ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించి మొక్కలు నాటారు. అప్పటినుంచి ఇప్పటి వరకు అటువైపు స్థానిక కౌన్సిలర్, ఉన్నత అధికారులు చూసింది లేదు, చేసింది లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.
అదేవిధంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంలో మొక్కలకన్నా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రకృతి వనమా పిచ్చి మొక్కల వనమా అని స్థానిక ప్రజలు విమర్శలు చేస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవం అంటూ పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటారు. కానీ ఇక్కడ మొక్కలు కరువు అయ్యాయి.. ఇదేనా తెలంగాణ హరితోత్సవం అని స్థానిక ప్రజలు విమర్శించారు.