Saturday, November 15, 2025
HomeతెలంగాణTeenage Issues : తడబడే వయసులో దారి తప్పితే.. పోలీసుల చుట్టూ చక్కర్లే గతి!

Teenage Issues : తడబడే వయసులో దారి తప్పితే.. పోలీసుల చుట్టూ చక్కర్లే గతి!

The rising trend of teenage girls in Karimnagar : పుస్తకాలు పట్టి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన చేతులు… కన్నీళ్లతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. ఆశలతో వికసించాల్సిన జీవితాలు, ఆకర్షణ అనే వలలో చిక్కి విలవిలలాడుతున్నాయి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరంగా మారుతున్న సామాజిక దుస్థితి. తెలిసీ తెలియని టీనేజీ వయసులో, ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలకు బలవుతున్న బాలికల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇటీవల వీణవంకలో ఓ బాలిక గర్భవతి కావడం, ఇల్లంతకుంటలో ప్రేమ మోసానికి ఓ బాలిక, ఆ మనస్తాపానికి ఆమె తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ విషవలయంలో బాలికలు ఎందుకు చిక్కుకుంటున్నారు..? దీనికి కారణం ఎవరు..? తల్లిదండ్రుల పాత్ర ఏంటి..?

- Advertisement -

ఆకర్షణే… ఆ తర్వాత అగచాట్లు : ఈ వయసులో బాలికలు అత్యంత సున్నితంగా ఉంటారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు యువకులు ప్రేమ పేరుతో వల పన్నుతున్నారు.

నమ్మకమే ఉచ్చు: కన్నవారి కంటే, కొత్తగా పరిచయమైన యువకుడే తమను బాగా అర్థం చేసుకుంటున్నాడని గుడ్డిగా నమ్ముతున్నారు.

వ్యక్తిగత సమాచారమే ఆయుధం: ఆ నమ్మకంతో వారు అడిగినప్పుడల్లా తమ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపి, తెలియకుండానే చిక్కుల్లో పడుతున్నారు.

దూరమవుతున్న హద్దులు: స్నేహం, సాన్నిహిత్యం శారీరక సంబంధం వరకు వెళ్లడానికి అవకాశం ఇస్తూ, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు.

కారణాల కడలి.. పరిష్కారం ఎక్కడ : ఈ పెడధోరణులకు కేవలం బాలికల అమాయకత్వమే కారణం కాదు, అనేక సామాజిక, కుటుంబపరమైన అంశాలు దీనిని ప్రభావితం చేస్తున్నాయి.

అవగాహన లేమి: యుక్తవయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులు, ఆకర్షణల వల్ల ఎదురయ్యే సమస్యలపై తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలతో మాట్లాడకపోవడం.

కుటుంబంలో ఆదరణ కరువు: ఇంట్లో సరైన ప్రేమ, ఆదరణ లభించకపోవడంతో, బయటి వ్యక్తుల నుంచి వచ్చే కపట ప్రేమకు సులభంగా ఆకర్షితులవుతున్నారు.

మాధ్యమాల ప్రభావం: సినిమాలు, సోషల్ మీడియాలో ప్రేమను ఒక సాహసంగా, గొప్పగా చిత్రీకరించడం వల్ల, వాస్తవ ప్రపంచానికి, కల్పనకు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు.

పర్యవేక్షణ లోపం: పిల్లలు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం.

గణాంకాల ఘోష.. ఆందోళనకరంగా కేసులు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నమోదవుతున్న కేసులు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.

పోక్సో కేసులు: ఏడాదికి 150 నుంచి 180 వరకు నమోదవుతున్నాయి.
ప్రేమ మోసాలు, కిడ్నాప్‌లు: సంవత్సరానికి సుమారు 480 కేసులు.

మిస్సింగ్ కేసులు: నెలకు 20కి పైగా మైనర్లు, యువతులు కనపడకుండా పోతున్నారు.
ఆత్మహత్యలు: ప్రేమలో మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఏటా 16 నుంచి 20 వరకు ఉంటోంది.

ఆందోళన కలిగించే విషయమేమిటంటే, పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ తరహా ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి.

నిపుణుల మాట : టీనేజీ పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా మెలగాలి. ప్రేమ, ఆకర్షణల వల్ల కలిగే మంచి చెడుల గురించి, వాటి పర్యవసానాల గురించి వారికి అర్థమయ్యేలా వివరించాలి. ఈ విషయాలను వారితో చర్చించకుండా దాచిపెట్టడం వల్లే, వారు తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. ప్రేమ, పెళ్లి, జీవితంపై ఉండే బాధ్యతలను వారికి విడమరిచి చెప్పాలి. వారి స్నేహితులు ఎవరు, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు అనే విషయాలను గమనిస్తూ ఉండాలి. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా ఉపాధ్యాయులు సైతం తల్లిదండ్రులకు తెలియజేయాలి.”
డాక్టర్ వర్షి, మానసిక వైద్య నిపుణులు, కరీంనగర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad