Teenmar Mallanna News: కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కవితకు ఓ అనధికారిక ఒప్పందం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన రోజున మంత్రిగా అవకాశం కవితకు వచ్చిందని ఇది నిజమో కాదో కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేయాలని మల్లన్న అన్నారు.
అగ్రకులాల వాళ్ల రాజకీయాల్లో పైఎత్తున ఉండి..వారంతా ఏకమై తమపై (బీసీలు) దాడి చేయాలని పన్నాగం పన్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో బీసీలందరూ ఏకమై ఒక రాజకీయ పార్టీగా ముందుకొస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీసీలంతా ఒకవైపు ఉంటే… కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం మరోవైపు అని మల్లన్న అన్నారు.
తన కార్యాలయం మీదుకి మనుషులను ఉసిగొలిపి తనపై కల్వకుంట్ల కవిత హత్యాయత్నం చేశారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. తమపై దాడి చేసింది మరెవరో కాదని.. కవిత బంధువు సుజిత్ రావునే అని ఆయన ఆరోపించారు.
అయితే తనపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు స్వాగతించలేదని తీన్మార్ మల్లన్న అన్నారు. కానీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర నేతలు విలేఖరులు సమావేశం పెట్టి మరీ కవితకు మద్దతుగా నిలిచారని ఆయన స్పష్టం చేశారు. మల్లన్నపై దాడి నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత కల్పించాలని మున్నారు కాపు ఐక్య సంఘం డిమాండ్ చేస్తోంది. ఆయనపై జరిగిన దాడిని ఆ సంఘం తీవ్రంగా ఖండించింది.


