పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenamar Mallanna)ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బీసీ సభలో రెడ్డి సామాజికవర్గంపై మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. అలాగే కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించారంటూ కులగణన నివేదికను తగలబెట్టారు. దీంతో ఈ పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది.
దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మల్లన్నను ఎన్ని సార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని తెలిపారు. బీసీ కులగణన ప్రతులు కాల్చడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయిందని పేర్కొన్నారు. అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిదే ఇదే పరిస్థితి ఎదురవుతోందని హెచ్చరించారు.
తాజా సస్పెన్షన్‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించింది. గతంలో ఆయన మాట్లాడిన పాత వీడియోను పోస్టు చేస్తూ ‘ఏం పీక్కుంటారో.. పీక్కోండి’.. ‘పులి బోన్‌లో నుంచి బయటకు వస్తే ఎట్లా వేటాడుతుందో చూపిస్తాడు’ తెలిపింది.