Saturday, November 15, 2025
HomeతెలంగాణEDUCATION ALERT: మీ సర్టిఫికెట్‌లో తప్పులున్నాయా? సరిచేసుకోకపోతే భవిష్యత్తుకే గండం!

EDUCATION ALERT: మీ సర్టిఫికెట్‌లో తప్పులున్నాయా? సరిచేసుకోకపోతే భవిష్యత్తుకే గండం!

10th grade certificate correction : పదో తరగతి సర్టిఫికెట్.. ఇది కేవలం ఓ మార్కుల పత్రం కాదు, మీ భవిష్యత్తుకు పునాది రాయి. పాస్‌పోర్ట్ నుంచి ఉద్యోగం వరకు, ప్రతీచోటా ఇదే ఆధారం. అలాంటి కీలకమైన పత్రంలో చిన్న అక్షర దోషం దొర్లినా, పుట్టిన తేదీ తప్పుగా పడినా, భవిష్యత్తులో మీరు పడాల్సిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను ముందే గుర్తించిన తెలంగాణ విద్యాశాఖ, 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు, తమ వివరాలను సరిచూసుకునేందుకు ఓ సువర్ణావకాశాన్ని కల్పించింది. అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది..? గడువు ఎప్పటివరకు ఉంది..?

- Advertisement -

ఎందుకింత ముఖ్యం : గతంలో, చిన్న పొరపాట్ల వల్ల ఎందరో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డికి చెందిన ఓ విద్యార్థి పేరులో అక్షరం తప్పుగా పడితే, ఆ తప్పును సరిచేయించుకోవడానికి నేటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. పటాన్‌చెరుకు చెందిన మరో విద్యార్థిని పుట్టిన తేదీ తప్పుగా పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో, విద్యాశాఖ ఈ ముందస్తు సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

ప్రక్రియ ఎలా జరుగుతుంది : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల వివరాలను ‘యూడైస్’ (UDISE) వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు తమ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించి, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. విద్యార్థి పేరు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వంటి వివరాలను ఆధార్ కార్డుతో సరిపోల్చుకుని, తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవాలి. కులం వివరాలు తప్పుగా ఉంటే, సంబంధిత తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి మార్పులు చేసుకోవచ్చు.

గడువు.. నవంబర్ రెండో వారం : ఈ వివరాల మార్పులు, చేర్పులకు విద్యాశాఖ నవంబర్ రెండో వారం వరకు గడువు ఇచ్చింది.

“ఒకసారి పదో తరగతి సర్టిఫికెట్ జారీ అయిన తర్వాత, మార్పులు చేసుకోవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకే, తల్లిదండ్రులు ఇప్పుడే పాఠశాలకు వెళ్లి, తమ పిల్లల వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తప్పకుండా సరిచూసుకోవాలి.”
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి

ఒకవేళ అప్పటికీ తప్పు దొర్లితే : పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కూడా, మూడేళ్లలోపు మాత్రమే వివరాలను సవరించుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పాఠశాల హెచ్.ఎం., ఎంఈవో, డీఈవోల ద్వారా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడి (DSE) కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల అసలు రిజిస్టర్‌లో ఉన్న వివరాలకు, సర్టిఫికెట్‌లోని వివరాలకు మధ్య తేడా ఉంటేనే మార్పులు చేస్తారు.

ప్రతి ఏటా సుమారు 1,500 మంది విద్యార్థులు ఇలాంటి సవరణల కోసం డీఎస్ఈ కార్యాలయానికి వస్తున్నారంటే, ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ముందే జాగ్రత్త పడటం శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad