Saturday, November 15, 2025
HomeతెలంగాణAadhaar : ఆధార్​కు కన్నం.. ఆపరేటర్లలో టెన్షన్!

Aadhaar : ఆధార్​కు కన్నం.. ఆపరేటర్లలో టెన్షన్!

Aadhaar operator biometric security : అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ.. వారి ఆధార్ లాగిన్ ఐడీలకు వరుస బెట్టి సందేశాల మోత మోగుతోంది. “మీ బయోమెట్రిక్‌తో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నం జరిగింది”… అంటూ అర్ధరాత్రి వేళ పదుల సంఖ్యలో వస్తున్న ఈ-మెయిళ్లు ఆధార్ కేంద్రాల ఆపరేటర్లను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక సమస్యా? లేక సైబర్ నేరగాళ్లు పన్నిన భారీ హ్యాకింగ్ వ్యూహమా? రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలేంటి?

- Advertisement -

అర్ధరాత్రి అలజడి.. అసలేం జరుగుతోంది : గత కొంతకాలంగా హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ సహా పలు జిల్లాల్లోని ఆధార్ కేంద్రాల ఆపరేటర్లను ఓ వింత సమస్య వేధిస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు, వారి అధికారిక లాగిన్ ఐడీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారి రిజిస్టర్డ్ ఈ-మెయిళ్లకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిసార్లు పదుల సంఖ్యలో విఫలయత్నాలు జరిగినట్లు, మరికొందరి విషయంలో విజయవంతంగా లాగిన్ అయినట్లు కూడా మెసేజ్‌లు వస్తుండటం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది.

సాధారణంగా లాగిన్ అయినప్పుడు సందేశాలు ఆలస్యంగా రావడం సహజమే అయినా, ఇలా అర్ధరాత్రి వేళ గంటల తరబడి వరుసగా రావడం అసాధారణమని ఆపరేటర్లు వాపోతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీదానికీ ఆధార్ అనుసంధానమైన ప్రస్తుత తరుణంలో, నేరుగా ఆపరేటర్ల లాగిన్లకే ఎసరు పెట్టే ప్రయత్నాలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

కొన్ని ఉదంతాలు : హైదరాబాద్: ముఖేశ్ అనే ఆపరేటర్ లాగిన్‌ను తెరవడానికి కేవలం ఆరు రోజుల వ్యవధిలో ఏకంగా 200 సార్లు విఫలయత్నం చేసినట్లు సందేశాలు వచ్చాయి.
కామారెడ్డి: గాంధారి మండలానికి చెందిన ఆపరేటర్ శ్రీకాంత్‌కు నెల రోజులుగా ప్రతీరోజూ దాదాపు 30 వరకు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి.

జోగులాంబ గద్వాల: మల్దకల్‌ మండలానికి చెందిన సిద్ధు అనే ఆపరేటర్‌కు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 31 సందేశాలు వచ్చాయి.

రంగంలోకి సంఘం.. అధికారులకు ఫిర్యాదు : ఈ సమస్యపై మీసేవ ఆధార్ కేంద్రాల సంఘం స్పందించింది. “ఈ వ్యవహారంపై ఈ నెల 24న మీసేవ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. ఆయన ఈ విషయాన్ని యూఐడీఏఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పూర్తి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు,” అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ తెలిపారు.

ఆపరేటర్లూ.. అప్రమత్తం : ఈ నేపథ్యంలో ఆపరేటర్లు తక్షణమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాస్‌వర్డ్ మార్చండి: వెంటనే మీ లాగిన్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి.
ఫిర్యాదు చేయండి: యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1947కు గానీ, [email protected]కు గానీ ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయండి.
సాక్ష్యాలు సేకరించండి: మీకు వచ్చిన ఈ-మెయిళ్ల స్క్రీన్‌షాట్లను భద్రపరిచి, మీ జిల్లా ఐటీ అధికారికి లేదా మీసేవ కమిషనర్‌కు పంపండి.
బయోమెట్రిక్ లాక్: యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్‌లోని “Lock/Unlock Biometrics” ఆప్షన్ ద్వారా మీ బయోమెట్రిక్‌లను తాత్కాలికంగా లాక్ చేసుకోండి.
సెక్యూరిటీ అప్‌డేట్: మీరు లాగిన్ అయ్యే కంప్యూటర్‌లో యాంటీవైరస్, ఫైర్‌వాల్ వంటి భద్రతా సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్ చేసుకోండి. ఈ సమస్యపై యూఐడీఏఐ అధికారులు త్వరగా స్పందించి, ఇది సాంకేతిక సమస్యో లేక హ్యాకింగ్ యత్నమో తేల్చి, తమ ఆందోళనలను తొలగించాలని ఆపరేటర్లు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad