Telangana farmers WhatsApp channel : వాతావరణ హెచ్చరికల కోసం పడిగాపులు.. రాయితీల వివరాలకు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు.. పంటకు చీడ పడితే ఎవరిని అడగాలో తెలియని అయోమయం.. రైతన్నల ఈ కష్టాలకు చెక్ పెడుతూ, తెలంగాణ వ్యవసాయ శాఖ ఓ విప్లవాత్మక అడుగు ముందుకేసింది. అత్యాధునిక సాంకేతికతను అన్నదాతకు చేరువ చేస్తూ, అధికారికంగా వాట్సాప్ ఛానల్‌ను ప్రారంభించింది. ఇకపై పంటల సమాచారం నుంచి వాతావరణ సూచనల వరకు, అన్నీ నేరుగా మీ అరచేతికే! అసలు ఏమిటీ ఛానల్..? దీనిలో ఎలా చేరాలి? దీనివల్ల రైతుకు కలిగే ప్రయోజనాలేంటి..?
సాంకేతికతతో సేద్యానికి ఊతం : మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న తరుణంలో, సమాచారాన్ని సత్వరమే రైతులకు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్’ పేరిట ప్రారంభించిన ఈ వాట్సాప్ ఛానల్, ప్రభుత్వానికి, రైతుకు మధ్య వారధిగా పనిచేస్తుంది.
ఛానల్‌లో ఎలా చేరాలి : ఈ ఛానల్‌లో చేరడం చాలా సులభం. మీ వాట్సాప్‌లోని ‘ఛానల్స్’ విభాగానికి వెళ్లి, ‘తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్’ అని వెతికి, ‘ఫాలో’ బటన్‌ను నొక్కితే సరిపోతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా రైతులు ఈ ఛానల్‌లో చేరారు. ప్రతి క్లస్టర్‌లోని వ్యవసాయ విస్తరణాధికారి (AEO) కనీసం 100 మంది రైతులను ఈ ఛానల్‌లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఛానల్ ద్వారా లభించే సమాచారం : ఈ అధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా రైతులకు అనేక రకాల కీలక సమాచారం నేరుగా అందుతుంది.
వాతావరణ హెచ్చరికలు: వర్షాలు, తుఫాన్ల గురించి వాతావరణ శాఖ చేసే హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి.
పంటల సలహాలు: ఏ కాలంలో ఏ పంట వేయాలి, చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, శాస్త్రవేత్తల సూచనలు అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వ పథకాలు: రాయితీ విత్తనాలు, ఎరువులు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోవచ్చు.
మార్కెట్ ధరలు: వివిధ మార్కెట్లలో పంటల ధరల వివరాలు తెలుసుకుని, దళారుల బారిన పడకుండా తమ పంటకు గిట్టుబాటు ధర పొందేందుకు ఇది దోహదపడుతుంది.
శిక్షణా కార్యక్రమాలు: వ్యవసాయ శాఖ నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు, రైతువేదికల్లో జరిగే అవగాహన సదస్సుల సమాచారం లభిస్తుంది.
“రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఈ వాట్సాప్ ఛానల్ రైతులకు ఎంతో ఉపయోగకరం. వాతావరణ సూచనల నుంచి మార్కెట్ ధరల వరకు, ప్రతి సమాచారం క్షణాల్లో రైతన్న చేతికి అందుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్‌ను సద్వినియోగం చేసుకోవాలి.”
– బి. ప్రమోద్ కుమార్, ఏఈవో
వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు.


