తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఠానికి.. సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్‌గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి, 2021 జనవరి నుంచి సీఎస్ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర పరిపాలనలో కీలకపాత్ర పోషించారు.
1991 బ్యాచ్‌కు చెందిన కె. రామకృష్ణారావు, ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 నుంచి ఆర్థిక శాఖను సమర్థవంతంగా నడిపిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఆయనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా రూట్ మ్యాప్‌లో కీలక పాత్రలు అప్పగించే సూచనలు ఉన్నాయి. రామకృష్ణారావుకు పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగియనుంది. అయినప్పటికీ, ఈ తక్కువ వ్యవధిలో ఆయన నుంచి పరిపాలన వ్యవస్థను మరింత చురుకుగా మార్చే ప్రయత్నాలను సీఎం ఆశిస్తున్నారు.
అంతేకాదు, సీఎస్ మార్పుతోపాటు సీఎం కార్యాలయం (CMO) లోనూ మార్పులు చేపట్టేందుకు సీఎం సీరియస్‌గా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర పరిపాలనలో సరికొత్త శకం మొదలవబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.