Friday, December 12, 2025
HomeతెలంగాణTiger monitoring : అడవికి అరణ్య భవన్​ అండ: కళ్లముందే పులుల కదలికలు!

Tiger monitoring : అడవికి అరణ్య భవన్​ అండ: కళ్లముందే పులుల కదలికలు!

Telangana tiger monitoring technology : అదిలాబాద్ అడవుల్లో స్వేచ్ఛగా విహరించే పెద్దపులిని.. హైదరాబాద్ నగర నడిబొడ్డున కూర్చుని ప్రత్యక్షంగా వీక్షించడం! ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు, తెలంగాణ అటవీశాశాఖ ఆవిష్కరించిన సరికొత్త వాస్తవం. రాష్ట్రంలోని అభయారణ్యాలపై 24/7 నిఘా పెట్టేందుకు, వన్యప్రాణుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు అరణ్య భవన్‌లో ఓ హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిద్ధమైంది. 

- Advertisement -

వన్యప్రాణుల సంరక్షణ, ముఖ్యంగా పెద్దపులుల పరిరక్షణ కోసం తెలంగాణ అటవీశాఖ ఓ కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలన్నింటినీ ఒకే చోట నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో “టైగర్ ప్రొటెక్షన్ మానిటరింగ్ సెల్”ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు దేశంలో మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వినియోగంలో ఉన్న ఈ సాంకేతికతను, రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాటు చేయడం తెలంగాణలో ఇదే ప్రథమం.

సాంకేతిక పంజాతో పర్యవేక్షణ : ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా అడవిలోని ప్రతి కదలికను అధికారులు తమ కళ్లముందు చూడగలరు.
రియల్​టైమ్ ట్రాకింగ్: అరణ్య భవన్‌లోనే కూర్చుని, సెల్‌ఫోన్ సిగ్నల్ ఉన్న అటవీ ప్రాంతాల్లో తిరిగే పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల కదలికల్ని రియల్​టైమ్​లో తెరపై చూడవచ్చు.
కెమెరా ట్రాప్​ చిత్రాలు: సిగ్నల్స్ అందుబాటులో లేని మారుమూల అటవీ ప్రాంతాల్లో అమర్చిన కెమెరా ట్రాప్‌లలో రికార్డ్ అయ్యే చిత్రాలను, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతిరోజూ ఈ సెంట్రల్ సర్వర్‌కు అప్‌లోడ్ చేస్తారు.
రేడియో కాలర్లు: త్వరలోనే పులులకు రేడియో కాలర్లు అమర్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. దీనివల్ల వాటి కచ్చితమైన లొకేషన్‌ను గుర్తించడం మరింత సులభమవుతుంది.

ఈ వ్యవస్థతో ప్రయోజనాలెన్నో : ఈ మానిటరింగ్ సెల్ ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
మానవ-వన్యప్రాణి ఘర్షణకు చెక్: గ్రామాల సమీపంలోకి పెద్దపులులు వచ్చినప్పుడు వాటి కదలికలను ముందుగానే గుర్తించి, స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడం సులభమవుతుంది.
వేటగాళ్లపై ఉక్కుపాదం: అడవిలో అనుమానాస్పదంగా సంచరించే వేటగాళ్ల ముఠాలను గుర్తించి, వెంటనే సమీపంలోని బృందాలను అప్రమత్తం చేసి వారిని పట్టుకోవచ్చు.
తక్షణ వైద్య సేవలు: గాయపడిన పులులను గుర్తించి, వాటికి అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించేందుకు వీలు కలుగుతుంది.
నష్టపరిహారంలో వేగం: పశువులపై పులులు దాడి చేసిన సందర్భాల్లో, వాస్తవాలను నిర్ధారించుకుని, తక్షణ స్పందన బృందాలను పంపడం, రైతులకు నష్టపరిహారం అందించడంలో జాప్యాన్ని నివారించవచ్చు.

అడవులను, అందులోని వన్య ప్రాణులను సంరక్షించడమే మా ప్రభుత్వ ఎజెండా. అటవీ ప్రాంతాల్లో మనుషుల భద్రత, వన్య ప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం 2019లోనే పలు కీలక సూచనలు చేసింది. వాటి ఆధారంగానే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ముందుకు వెళుతున్నాం.”
– కొండా సురేఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి

పులులను ఎలా గుర్తిస్తారో తెలుసా?
చారలే ఆధారం: మనిషికి వేలిముద్రలు ఎలాగో, పులికి దాని శరీరంపై ఉండే చారలు కూడా అంతే ప్రత్యేకం. ఒక పులికి ఉన్న చారలు మరో పులికి ఉండవు. వీటి ఆధారంగానే వాటిని లెక్కిస్తారు.
కెమెరా కన్ను: అడవుల్లో అమర్చిన ఆటోమేటిక్ కెమెరాల ముందు నుంచి పులి వెళ్లినప్పుడు ఫొటోలు, వీడియోలు రికార్డ్ అవుతాయి. సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆ చిత్రాల్లోని చారలను విశ్లేషించి అది ఏ పులో గుర్తిస్తారు.
పాదముద్రలు: పులి ప్రయాణించే మార్గంలో దాని పాదముద్రల (పగ్‌మార్క్స్) ఆధారంగా కూడా వాటిని గణిస్తారు.
డీఎన్ఏ పరీక్ష: పులి వెంట్రుకలు, మలం వంటివి సేకరించి డీఎన్ఏ పరీక్షించడం ద్వారా కూడా దానిని కచ్చితంగా గుర్తిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News