అర్చక ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘం జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్ర చార్యులు అన్నారు. మే31న ప్రారంభించబోయే బ్రాహ్మణ భవన్ కార్యక్రమానికి సంబంధించి బుధవారం బొగ్గులకుంట దేవాదాయ శాఖ ముఖ్య కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు అర్చక ప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉద్యోగులంతా కలిసి రావాలని కోరారు. సిఎం కెసిఆర్ దేవాదాయ శాఖలో ఉన్న 5,625 మంది అర్చక ఉద్యోగులకు జీవో నెం. 577 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తూ బ్రాహ్మణులకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలను అభివృద్ధి పరుస్తూ జీర్ణోదరణకు నోచుకోని ఎన్నో దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకాలను అమలుపరుస్తూ ఎంతోమంది అర్చక ఉద్యోగుల కుటుంబాలు ప్రశాంతంగా ఉండే విధంగా ఎన్నో రకాల సేవలను, అనేక రకాల సహాయ సహకారాలను అందిస్తూ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అర్చక ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించారన్నారు.
అర్చక ఉద్యోగుల అందరి తరపున సిఎం కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, అధ్యక్షులు చింతపట్ల బద్రీనాథచార్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షులు కాండూరి కృష్ణమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్రం చంద్రశేఖర శర్మ, గౌరవ సలహాదారులు శేషబట్టరు కృష్ణమాచార్యులు, ఇతర జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.