ఎస్సీ వర్గీకరణ(SC Classification bill) బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహా సభలో ప్రవేశపెట్టారు. గ్రూపు-1లో అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్, మాదిగలు ఉన్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించారు.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటోందన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో ఎస్సీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి అయిన దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. ఇప్పుడు దశాబ్దాల తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామన్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని వెల్లడించారు. కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించామన్నారు.