తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. లగచర్ల(Lagacharla)ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నిరసనలకు దిగాయి. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ఇందుకు అంగీకరించలేదు. దీంతో నిరసనల మధ్యే మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
ముందుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశ పెట్టారు. ఇది కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఇక జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా ప్రతిపక్షాల నిరసనల మధ్యే సభ ఆమోదించింది. అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభను బుధవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు.