Telangana bandh over BC reservations: బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ ప్రభావంతో ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో, దీపావళి సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఉదయం నుంచి ఉదృతంగా సాగిన బంద్.. సాయంత్రానికి బంద్ ప్రభావం తగ్గడంతో డిపోల నుంచి ఇప్పుడిప్పుడే బస్సులు బయటికొస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో 2600 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ఎదుల బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/minister-ponnam-prabhakar-comments-on-bc-reservation-issue/
ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్న ప్రవేటు వాహనాలు..
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇవాళ ఉదయం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనలు చేపట్టారు. డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకున్నారు. బంద్ కారణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బస్సు రోడ్డెక్కకపోవడంతో.. ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక డబ్బులను వసూలు చేశారు. ఇక, ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ప్రయాణికులను నిలువునా దోపిడీ చేశాయి. ఎమర్జెన్సీ సేవల్లో పని చేసే సిబ్బంది ఉద్యోగాలకు వెళ్లేందుకు క్యాబ్‍లను ఆశ్రయించారు. దీంతో వారు చెప్పే ధరలను చూసి ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల దందాతో ప్రయాణికులను షాక్‌కు గురవుతున్నారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు వెళ్లే ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో క్యాబ్ డ్రైవర్లు రూ. 300 తీసుకునేవారు.. కానీ, ఇవాళ బంద్ కారణంగా.. రూ.700 వసూలు చేస్తున్నారు. ఇక నగరంలో అయితే ఇన్నాళ్లు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకంతో బోసి పోయిన ఆటోలు.. ఇవాళ ప్రయాణికుల రద్దీతో ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా.. ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్ వాహనాల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, బీసీ బందుకు సంఘీభావంగా అనేక షాపులు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. మెడికల్ షాపులు, ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేయాలని బీసీ జేఏసీ వ్యాపారులను విజ్ఞప్తి చేసింది.


