Telangana Bathukamma festival 2025: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, పూల పండుగ బతుకమ్మ ఇక సరికొత్త హంగులు అద్దుకోనుంది. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ‘కార్నివాల్’ తరహాలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే ఈ ఉత్సవాలను గిన్నిస్ రికార్డులకెక్కిండమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ వేడుకల వెనుక ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఈ పూల సంబరం తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు ఎలా తీసుకువెళ్లనుంది..?
కార్నివాల్‌లా పది రోజులు : ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను మునుపెన్నడూ లేని విధంగా ఒక అంతర్జాతీయ స్థాయి కార్నివాల్‌లా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన ‘మన బతుకమ్మ’ పోస్టర్లను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు పది రోజుల పాటు ఈ పూల జాతర అద్భుతంగా సాగుతుందని ఆయన తెలిపారు.
వరంగల్ నుంచి ప్రారంభం : ఈ నెల 21న ఓరుగల్లులోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగే విదేశీ పర్యాటకులకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేక స్వాగత నృత్యాలతో ఆహ్వానం పలుకుతారు.
ప్రత్యేక ఆకర్షణ ‘ఛాప్-2025’ : ఈ ఉత్సవాల్లో భాగంగా “ఛాప్-2025” (కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్) పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యాటక శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) సంయుక్తంగా ఈ నెల 12 నుంచి 17 వరకు శిల్పారామంలో దీనిని ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో చేనేత, హస్తకళల ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు తెలంగాణ కళాకారులకు గొప్ప వేదిక కానున్నాయి.
ఉత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే..
సెప్టెంబర్ 27: ట్యాంక్‌బండ్‌పై భారీ ‘బతుకమ్మ కార్నివాల్’.
సెప్టెంబర్ 28: ఎల్బీ స్టేడియంలో వేలాది మహిళలతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ కార్యక్రమం.
సెప్టెంబర్ 29: పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు (ఐటీ ఉద్యోగులకు ప్రత్యేకంగా).
సెప్టెంబర్ 30: ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మతో గ్రాండ్ ఫినాలే.
బతుకమ్మ – ప్రకృతితో పెనవేసుకున్న బంధం : బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానం. ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే గొప్ప సంప్రదాయం. ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి పూలకు విశేష ప్రాధాన్యం ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే సీజనల్ వ్యాధులను నివారించే ఔషధ గుణాలు ఈ పూలలో ఉన్నాయని, బతుకమ్మ పేర్చడం ద్వారా ఆ గుణాలు గాలిలో కలిసి ఆరోగ్యాన్నిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.


