Telangana Bathukamma Carnival 2025: తెలంగాణ సంస్కృతికి ప్రతీక, పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నిర్వహించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏకంగా 10,000 మంది ఆడపడుచులతో ఒకేచోట బతుకమ్మ ఆడి, ప్రపంచ రికార్డును నెలకొల్పాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2016లో వరుణుడి కారణంగా చేజారిన గిన్నిస్ రికార్డును ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అసలు ఈ మెగా ఈవెంట్ ఎక్కడ జరగనుంది..? ఈ పది రోజుల పండుగలో ఏ రోజు, ఏం ప్రత్యేకత..?
ఈసారి గురి తప్పదు.. రికార్డు ఖాయం : 2016లో గిన్నిస్ బుక్ రికార్డు కోసం చేసిన ప్రయత్నం భారీ వర్షం కారణంగా విఫలమవ్వడంతో, ఆ లోటును ఈసారి భర్తీ చేయాలని జీహెచ్‌ఎంసీ పట్టుదలగా ఉంది. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో అదనపు కమిషనర్ ఎస్. పంకజ నేతృత్వంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
“ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో ఈ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించనున్నాం. జీహెచ్‌ఎంసీ తరఫున 6,000 మందిని, మెప్మా, సెర్ప్ సంస్థల ద్వారా మరో 4,000 మందిని సమీకరిస్తున్నాం. ఈ వేడుక కోసం తీరొక్క పూలతో 52 అడుగుల భారీ బతుకమ్మను సిద్ధం చేస్తున్నాం,” అని అదనపు కమిషనర్ పంకజ వెల్లడించారు.
పది రోజుల పండుగ జాతర.. వేడుకల షెడ్యూల్ ఇదే : పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 21 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్నివాల్ తరహాలో ఈ వేడుకలు జరగనున్నాయి.
21వ తేదీ: వరంగల్‌లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి.
22 నుంచి 26 వరకు: రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు, వారసత్వ కట్టడాల వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
27న కార్నివాల్: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్‌పై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భారీ కార్నివాల్ ఉంటుంది. తెలంగాణ పిండివంటకాలు, ఆహార ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
28న ప్రపంచ రికార్డు యత్నం: ఎల్బీ స్టేడియంలో 10,000 మంది మహిళలతో మహా బతుకమ్మ వేడుక.
29న పోటీలు: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు, మహిళా బైక్ రైడర్స్‌తో సమావేశాలు ఉంటాయి.
30న ముగింపు ర్యాలీ: సచివాలయం ముందున్న అమరవీరుల స్తూపం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.ఈ ఉత్సవాల్లో భాగంగా కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఎయిర్‌పోర్టులో జానపద నృత్యాలతో పర్యాటకులకు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


