Telangana Bathukamma Celebrations 2025: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సంబరాలు జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఈనెల 21న హైదరాబాద్ శివారులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరాలు రేపటి (సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడిని ముస్తాబు చేశారు. బతుకమ్మ అరంభ వేడుకలో తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (అనసూయ) పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపోందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసిందని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడ్డబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.బతుకమ్మ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని కోరారు.
Also Read: https://teluguprabha.net/national-news/big-relief-for-gayatri-projects-on-loan-waived/
బతుకమ్మ సంబరాల షెడ్యూల్ ఇదే..
22న హైదరాబాద్‌లోని శిల్పరామం, మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి వద్ద సంబరాలు నిర్వహించనున్నారు.
23న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, 24న భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్‌లో వేడుకలు ఉంటాయి.
25న భద్రాచలం, అలంపుర్ జోగులాంబ ఆలయాల్లో పండగ చేయనున్నారు.
26న నిజామాబాద్‌లోని అలీసాగర్, మెదక్, ఆదిలాబాద్‌లలో సంబరాలు నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో సైకిల్ ర్యాలీ ఉంటుంది.
27న ఉదయం నెక్లెస్ రోడ్‌లో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నివాల్ ఉంటాయి.
28న నగరంలోని ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ, 10 వేల మందికిపైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా భారీ వేడుకలు నిర్వహించనున్నారు.
29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాలతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో బతుకమ్మ వేడుకలు ఉంటాయి.
30న ట్యాంక్‌బండ్‌పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపనీయుల ప్రదర్శన (ఇకెబానా), సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ ఉంటుంది.


