Saturday, November 15, 2025
HomeతెలంగాణTelangana BC Reservations ఇలా చేస్తేనే బీసీలకు 42 శాతం సాధ్యం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా

Telangana BC Reservations ఇలా చేస్తేనే బీసీలకు 42 శాతం సాధ్యం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా

Telangana BC Reservations తెలంగాణలో బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో వేశామని చేతులు దులుపుకుంటుందా లేక చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనే అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో తేలుతుందా లేక కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉందా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

- Advertisement -

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే కారణాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అయితే 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిన్న సోమవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. బహుశా ఈ వారం అంటే గురు, శుక్రవారాల్లో కోర్టులో విచారణకు రావచ్చు.

కోర్టులో తేలే అంశమేనా ఇది…

అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో చిత్తశుద్ధి కన్పించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్ల అంశంపై తుది నిర్ణయం సుప్రీంకోర్టు కంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో తమిళనాడులో ఇదే జరిగింది. 1993లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి చేరాయి. దీనికోసం ఆమె అప్పట్లో ప్రత్యేక అసెంబ్లీని సమావేశపర్చి తీర్మానం చేయడమే కాకుండా అదే నెలలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఫలితంగా 76వ చట్ట సవరణ చేసి షెడ్యూల్ 9లో పొందుపరిచారు.

కన్పించని చిత్తశుద్ధి, బీసీలను మభ్యపెట్టేందుకేనా

ఇక్కడ కూడా తెలంగాణలో అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పార్టీల్ని కలుపుకుని ప్రధానిని కలిసే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్ధమౌతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీకు తెలంగాణ నుంచి ఏకంగా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలో అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వెలువడుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుంటే ఆ నెపం బీజేపీపై పడుతుంది. ఒప్పుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది.

కానీ కేవలం కోర్టులో వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బీసీలను దూరం చేసుకోవల్సి వస్తుంది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని ఎక్కడా లేదు గానీ ఇందిరా సాహాని, కృష్ణమూర్తి, గావలి వంటి కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశాలున్నాయి. అందుకే ఈ అంశం కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పరిష్కారం కావచ్చని పలువురు మేధావుల అభిప్రాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad