TBJP: తెలంగాణ బీజేపీలో కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కార్యవర్గం తీవ్ర అసంతృప్తులకు దారితీస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించిన 22 మంది సభ్యుల కార్యవర్గంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ కూర్పు ఊహించని రీతిలో ఉందని, అనుభవజ్ఞులైన, పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభించలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. సీనియర్లను కాదని కొంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పది మందికిపైగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉండడంపై ఇతర జిల్లాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేవలం రాజధాని నగరానికే పరిమితం కాదని, తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు అంతర్గంగా వాదిస్తున్నట్లు సమాచారం.
పార్టీ బలోపేతం కావాలంటే అన్ని జిల్లాల నుంచి సమర్థులైన వారికి అవకాశం ఇవ్వాలని నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కమిటీని రాంచందర్‌రావు తన సొంత నిర్ణయంతో ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిష్టానం జోక్యంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కీలక వ్యక్తుల ఒత్తిడితో ఈ జాబితా ఖరారైందని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు తన టీంను స్వతంత్రంగా ఎంపిక చేసుకోలేకపోతే, పార్టీ వ్యవహారాలను సమర్థంగా ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన పలువురు నాయకులు కూడా ఈ కార్యవర్గంలో తమకు చోటు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో చేరినప్పుడు వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట నిలబెట్టుకోలేదని వాపోతున్నారు. ఈ పరిణామం కొత్తగా చేరాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తుందని, పార్టీ విస్తరణకు ఇది అడ్డంకిగా మారుతుందని ఆరోపిస్తున్నారు. కొత్త కార్యవర్గంలో సామాజిక సమీకరణలపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 22 మంది సభ్యుల్లో 11 మంది ఓసీలు (ఓపెన్ కేటగిరీ), ఏడుగురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారు. బీసీలకు, ఎస్సీలకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, ముఖ్యంగా బీసీ జనాభా అధికంగా ఉన్న తెలంగాణలో కేవలం ఏడుగురికి మాత్రమే చోటు కల్పించడం సరికాదని కాషాయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించకపోతే, ఎన్నికల్లో వారి మద్దతు కూడగట్టడం కష్టమవుతుందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, బీజేపీ కొత్త కార్యవర్గం పార్టీలో అంతర్గత కలహాలకు, అసంతృప్తులకు కారణమవుతోందని చర్చ జరుగుతోంది.


