తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బడ్జెట్(Telangana Budget) ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ. 3,04,965 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. 72 పేజీలతో బడ్జెట్ ప్రసంగం రూపొందించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలు అని తెలిపారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. అధికార పీఠం హోదాగా భావించడం లేదని.. ప్రజల కోసం బాధ్యతగా వ్యవహరిస్తున్నామన్నారు. దశాబ్ధకాలం పాలన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 200 మిలియన్ డాలర్లుగా ఉండగా.. రాబోయే కాలంలో ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు బడ్జెట్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఆటంకం కలిగిస్తున్నారు.