సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) ఆమోదం తెలిపింది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. కాసేపట్లో ఈ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ కోటాలో మొత్తం 15 శాతం రిజర్వేషన్ అమలు చేయనుండగా అందులో 1 శాతం సంచార జాతులు, 9 శాతం మాదిగ ఉప కులాలు, 5 శాతం మాల ఉపకులాలకు రిజర్వేషన్లు వర్తింపజేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా కులగణన చేసి చరిత్ర సృష్టించామన్నారు. పకడ్బందీగా సర్వేచేసి సమాచారం సేకరించామని.. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రధాని మోదీపై ఒత్తిడి పెరగనుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని డిమాండ్ రానుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ముఖ్యమైన అంశాల మీద చర్చించేటప్పుడు ప్రతిపక్ష నేత సభకు రావాలి కదా.. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత,లేదని ఆయన విమర్శించారు.