Telangana cabinet bc reservations local elections decisions: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నేడు (గురువారం) కేబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో స్థానిక సంస్థల అంశంపై మంత్రులు సుధీర్ఘంగా చర్చించారు. అయితే, ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, నవంబర్ 7న మళ్లీ కేబినెట్ భేటీ నిర్వహించి.. ఆ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. నవంబర్ 3న హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉన్నందున అప్పటివరకు వేచి చూడాలని, హైకోర్టు తీర్పు అనంతరం చర్చిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. అందుకే, ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్‌లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టతనివ్వలేదు. అయితే, ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు మాత్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. సెక్షన్ 21(3) తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకురానుంది. కాగా, ఈ అంశంపై గతంలోనే చర్చ జరగగా తాజా సమావేశంలో చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. కాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో జరిపిన చట్ట సవరణను తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేశారు. దాన్ని అనుసరించి రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి సమర్పించగా మంత్రి ఆమోదించారు. ఈ సవరణను ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సమర్పించడంతో చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.
పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే ఛాన్స్..
కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హై కోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలా? లేక హై కోర్టు తీర్పు కోసం వెయిట్ చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. అయితే, గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో స్థానిక ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగిన ఈ విషయం చర్చకు రాలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి వద్ద, తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండడం, జీఓలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మంత్రివర్గంలో ఏ నిర్ణయం తీసుకోలేక పోయినట్లు తెలుస్తుంది. అయితే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వపరంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది. అయితే, ఈ విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తే.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని, వేచి చూసే ధోరణి అవలంభిస్తోన్నట్లు సమాచారం.


