తెలంగాణ కేబినెట్ జనవరి 4వ తేదీన సమావేశం కానుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet) జరగనుంది. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా డిసెంబర్ 30న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు జరగాల్సిన కేబినెట్ భేటీని జనవరి 4ను నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక విద్యుత్ కమిషన్, స్థానిక సంస్థల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై చర్చించే అవకాశం ఉంది.