రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ జరుగనుంది. ఈమేరకు ఎన్నికల కమిషన్ రేవంత్ సర్కారుకు అనుమతులు మంజూరు చేస్తూ షరతులు విధించింది. తెలంగాణ క్యాబినెట్ భేటీకి కొన్ని షరతులు విధిస్తూ… జూన్ 4వ తేదీ లోపు నిర్వహించాల్సిన అత్యవసర సేవలు-పనులపై మాత్రమే క్యాబినెట్ భేటీలో చర్చించాలని ఈసీ కండిషన్లు పెట్టింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి రాజకీయ అంశాలపై మాత్రం క్యాబినెట్ లో చర్చించరాదని ఈసీ ఆదేశించింది.
దీంతో రేపు మధ్యహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. నిజానికి నిన్ననే రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ అనుమతించలేదు. దీంతో చివరి నిమిషంలో క్యాబినెట్ భేటీ రద్దు కాక తప్పలేదు. మరోవైపు ఈసీని కలిసి ఈ అంశంపై ప్రత్యేక అనుతులు తెచ్చుకునైనా మంత్రి వర్గ భేటీ నిర్వహించేందుకు సీఎం సిద్ధమయ్యారు. పాలనాపరమైన అత్యవసర అంశాలపై క్యాబినెట్ చర్చించాల్సిన అవసరం ఉందని రేవంత్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈలోగా ఈసీ ఈమేరకు అనుమతులివ్వటం విశేషం.